సాక్షి, సిటీబ్యూరో: గచ్చిబౌలి పరిధిలో ఓ స్నాచింగ్‌కు పాల్పడిన చోరుడు పారిపోయేందుకు సిటీ బయటకు దారి తీసే రోడ్డు ఎక్కాడు. ‘డయల్–100’ ద్వారా దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు కేవలం మూడు నిమిషాల్లోనే అతడిని గుర్తించి వెంటపడ్డారు. పారిపోవడమే పరమావధిగా పెట్టుకున్న ఆ దొంగకు రూల్స్, స్పీడ్ లిమిట్ ఉండవు కదా..! అయితే మన పోలీసు వాహనం మాత్రం అధికారులు విధించిన ‘పరిమితి’ నేపథ్యంలో గంటకు 60 కిమీ వేగాన్ని దాటలేదు. ఫలితంగా అతను చూస్తుండగానే కనుమరుగయ్యాడు.
♦ సైబరాబాద్ ఉన్నతాధికారులు ఇటీవల తీసుకున్న నిర్ణయం కారణంగా భవిష్యత్తులో తరచూ ఇలాంటి సీన్లు ఎదురుకావచ్చు. ‘రోగమొక చోట.. మందొక చోట’ అన్న చందంగా వ్యవహరించిన ఉన్నతాధికారులు ఇటీవల చోటు చేసుకున్న పోలీసు వాహనాల ప్రమాదాల నేపథ్యంలో ‘కీలక నిర్ణయం’ తీసుకున్నారు. ఏసీపీ స్థాయి అధికారులు వినియోగించే వాటి సహా ఏ వాహనమూ గంటకు 60 కిమీ మించకుండా లాక్ ఏర్పాటు చేశారు. ఈ నిర్ణయంపై అధికారులు, సిబ్బంది గగ్గోలు పెడుతున్నారు. డ్రైవర్లు, డ్రైవింగ్‌లో లోపాలను సరి చేయకుండా ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడం తగదని వారు వాపోతున్నారు.
ప్రమాదం పై యాక్షన్...
గత నెల మూడో వారంలో రాజేంద్రనగర్ ఠాణా పరిధిలో ఓ పోలీసు పెట్రోలింగ్ వాహనం ప్రమాదానికి గురైంది. తెల్లవారుజామున విధుల్లో ఉన్న వాహనానికి కుక్క అడ్డు రావడంతో దానిని తప్పించే క్రమంలో అదుపుతప్పి ఫల్టీకొట్టింది. ఫలితంగా వాహనం పూర్తిగా ధ్వంసమైంది. ఈ ఘటనకు ముందూ ఇలాంటివి సైబరాబాద్‌లో చోటు చేసుకున్నాయి. ఈ ప్రమాదంలో మాత్రం డ్రైవర్‌తో పాటు ముగ్గురిపై ఉన్నతాధికారులు వేటు వేశారు. ఆ సమయంలో వాహనాన్ని నడిపిన హోంగార్డు డ్రైవర్, పక్కనే ఉన్నందుకు కానిస్టేబుల్, వెనుక కూర్చున్న సబ్–ఇన్‌స్పెక్టర్‌పై చర్యలు తీసుకున్నారు. చోటు చేసుకున్నది ప్రమాదం అయినప్పుడు అసలు డ్రైవర్ పైనే చర్యలు తీసుకోకూడదు. అలాంటిది అతడితో పాటు పక్కన, వెనుక కూర్చున్న వారి పైనా వేయడం విమర్శలకు తావిస్తోంది.
కొత్తవి ఇచ్చినా ప్రయోజనం శూన్యం...
కమిషనరేట్ పరిధిలో తరచూ పోలీసు వాహనాలు ప్రమాదాలకు గురవుతున్నాయి. ఇవి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో మరింత తీవ్రంగా మారే ప్రమాదం ఉందని ఉన్నతాధికారులు భావించారు. దీంతో గస్తీ వాహనాలు, ఇన్‌స్పెక్టర్లు వినియోగించే వాటితో పాటు ఏసీపీలు వాడే వాహనాలకు స్పీడ్ లాకింగ్ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. తక్షణం దానిని అమలులోకి తీసుకువస్తూ ఆయా వాహనాలు గరిష్టంగా గంటకు 60 కిమీ వేగం మించి ప్రయాణించకుండా ఏర్పాట్లు చేశారు. అత్యంత రద్దీ ప్రాంతాలు ఎక్కువగా ఉండే నగరంలో ఇలాంటి నిర్ణయం సమంజసమే అయినా.. దూరంగా విసిరేసినట్లు ఉండే కాలనీలు, సువిశాలమైన రోడ్డు, ఎటు చూసినా హైవేలతో కనెక్టివిటీ కలిగి ఉండే సైబరాబాద్, రాచకొండ పరిధిలో ఇలాంటి నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదురవుతాయని సీనియర్ అధికారులే వ్యాఖ్యానిస్తుండటం గమనార్హం. పోలీసు అధికారులకు కొత్తగా హైఎండ్ వాహనాలు ఇవ్వడం వెనుక అసలు ఉద్దేశమే వారి కదలికల్లో వేగం పెంచాలని, మరింత సమర్థంగా పెట్రోలింగ్ జరగాలని. అలాంటప్పుడు ఈ లాకింగ్ చేస్తే ఫలితం ఏముంటుందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.
లోపాలు యథాతథం..
ప్రమాదాలు తదితర ఉదంతాలు చోటు చేసుకోవడానికి కారణమవుతున్నా వ్యవస్థాగత లోపాలకు విడిచిపెట్టి పైపై చర్యలతో ఫలితాలు ఉండవని అధికారులు పేర్కొంటున్నారు. గడిచిన కొన్నేళ్లుగా పోలీసు విభాగంలో వాహనాల సంఖ్య పెరిగినంత వేగంగా, ఆ స్థాయిలో డ్రైవర్ పోస్టుల సంఖ్య పెరగట్లేదు. ఫలితంగా ఇప్పటికే పలు ప్రాంతాల్లో డ్రైవింగ్ తెలిసిన హోంగార్డు, ఆరŠడ్మ్ రిజర్వ్ విభాగానికి చెందిన వారే డ్రైవర్లుగా వ్యవహరిస్తున్నారు. వీరికి పూర్తి స్థాయిలో శిక్షణ, నైపుణ్యం ఉండట్లేదు. దీనికి తోడు గస్తీ వాహనాల్లో విధులు నిర్వర్తిస్తున్న వారు సమయాలను బట్టి ఒక్కోసారి నిర్విరామంగా 12 గంటలు విధుల్లో ఉండాల్సి వస్తుంది. అధికారుల వాహనాలకు డ్రైవర్లుగా ఉండే వారికి కాస్తా విశ్రాంతి దొరికే అవకాశం ఉన్నా గస్తీ వాహనాలను డ్రైవ్ చేసే వారికి ఆ అవకాశమూ ఉండదు. దీనికి తోడు ప్రధానంగా వేళగాని వేళల్లో డ్రైవింగ్ చేస్తున్న వారికి ప్రమాదాల ముప్పు ఎక్కువగా ఉంటోంది. డ్రైవర్లు సం ఖ్య పెంచడం, డ్రైవింగ్ నైపుణ్యాలను మెరుగుపరచడం తదితర అసలు లోపాలను సరిచేయడం మానేసి వాహనాలు స్పీడు తగ్గిస్తే మొదటికే మోసం వస్తుందనే వాదన వినిపిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment