
నూతన దంపతులు రవీందర్, రుషానిచారుక
మాచారెడ్డి : మాచారెడ్డి మండలం అక్కాపూర్ గ్రామానికి చెందిన అగరిగె రవీందర్ శ్రీలంకకు చెంది రుషానీచారుక అనే అమ్మాయిని సోమవారం అక్కపూర్‌లో వివాహం చేసుకున్నాడు. బతుకుదెరువు కోసం దుబాయి వెళ్లిన రవీందర్ అక్కడ డ్రైవర్‌గా స్థిరపడ్డాడు. శ్రీలంక అమ్మాయి రవీందర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న కంపెనీ ఆస్పత్రిలో నర్సుగా పనిచేస్తోంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఆస్పత్రికి వెళ్లినప్పుడు చారుకతో మూడు సంవత్సరాల క్రితం పరిచయం ఏర్పడింది.
ఆ పరిచయం కాస్త ప్రేమగా మారి పెళ్లి వరకు దారి తీసింది. చారుక తన తల్లిదండ్రులకు ప్రేమ వ్యవహారాన్ని తెల్పడంతో వారు అంగీకరించినట్లు రవీందర్ తెలిపారు. వారం రోజల కిందట చారుకతో కలిసి రవీందర్ స్వగ్రామానికి వచ్చారు. వారు హిందూ సంప్రదాయ పద్ధతిలో పెళ్లి చేసుకున్నారు.
ఈ సందర్భంగా రుషానీచారుక మాట్లాడుతూ భారతదేశ సంప్రదాయాలు చాలా పవిత్రమైనవి, గొప్పవని అన్నారు. ఆమె ఐ లైక్ ఇండియన్ కల్చర్ అంటూ వచ్చీరాని తెలుగులో మాట్లాడారు. ఇండియన్ సంప్రదాయలన్నా తనతో పాటు తన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు చాలా ఇష్టమని అన్నారు.వీసా దొరకక పోవడంతో తన తల్లిదండ్రులు పెళ్లికి రాలేకపోయారని తెలిపారు.