సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కరోనా కేసుల తీవ్రత పెరుగుతుండటంతో పదో తరగతి పరీక్షల నిర్వహణపై ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు సోమవారం సంచలన నిర్ణయం తీసుకున్నారు. టెన్త్ పరీక్షలను రద్దు చేయాలని నిర్ణయించారు. కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రస్తుత తరుణంలో పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని, అందువల్ల పరీక్షలు నిర్వహించకుండానే టెన్త్ విద్యార్థులందరినీ పైతరగతులకు ప్రమోట్ చేయాలని విద్యాశాఖను ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయంతో 2 నెలలుగా పరీక్షలు జరుగుతాయో లేదో తెలియక ఉత్కంఠకు గురైన 5,34,903 మంది విద్యార్థులకు ఊరట లభించినట్లయింది. ఇలా టెన్త్ పరీక్షలు రద్దు కావడం ఉమ్మడి ఏపీ, తెలంగాణ చరిత్రలో ఇదే తొలిసారి.
దేశంలో, రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రబలుతున్న నేపథ్యంలో ఇప్పటికే రెండుసార్లు వాయిదా వేసిన పదో తరగతి పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలు, విద్యార్థుల భవిష్యత్తుపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ సోమవారం ప్రగతి భవన్‌లో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రామచంద్రన్, సీఎంఓ ముఖ్య కార్యదర్శి ఎస్. నర్సింగ్‌రావు పాల్గొన్న ఈ సమావేశంలో పదో తరగతి పరీక్షల విషయంలో వివిధ రాష్ట్రాలు అనుసరించిన పద్ధతులను పరిశీలించారు. తెలంగాణలో ఏమి చేయాలనే విషయమై సుదీర్ఘంగా చర్చించారు. అనంతరం రాష్ట్రంలో అనుసరించాల్సిన పద్ధతిని ఖరారు చేశారు. గతంలో పాఠశాలల్లో నిర్వహించిన ఇంటర్నల్ అసెస్‌మెంట్ పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా వచ్చే గ్రేడ్లను పరిగణనలోకి తీసుకొని పదో తరగతి విద్యార్థులను పైతరగతికి ప్రమోట్ చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. మరోవైపు డిగ్రీ, పీజీ తదితర పరీక్షల నిర్వహణకు సంబంధించి భవిష్యత్ పరిస్థితులనుబట్టి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిశ్చయించింది.
మూడు పేపర్ల పరీక్షలు పూర్తయ్యాక...
రాష్ట్రంలో మార్చి 19 నుంచి ఏప్రిల్ 6 వరకు పదో తరగతి పరీక్షల నిర్వహణకు ప్రభుత్వం తొలుత ఏర్పాట్లు చేసింది. మొత్తం ఆరు సబ్జెక్టుల్లోని 11 పేపర్లకు పరీక్షలు జరగాల్సి ఉండగా అందులో రెండు సబ్జెక్టులకు సంబంధించిన 3 పేపర్ల పరీక్షలు పూర్తయ్యే సమయానికి కేంద్రం జనతా కర్ఫ్యూ, కరోనా లాక్‌డౌన్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు ఆదేశంతో మార్చి 23 నుంచి నిర్వహించాల్సిన పరీక్షలను ప్రభుత్వం తొలుత వాయిదా వేసింది. ఆ తర్వాత కరోనా జాగ్రత్తలతో జూన్ 8 నుంచి తిరిగి పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేయగా కరోనా తీవ్రత దృష్ట్యా హైదరాబాద్, సికింద్రాబాద్‌తోపాటు జీహెచ్‌ఎంసీ పరిధిలోకి వచ్చే జిల్లాల్లో పరీక్షలు నిర్వహించరాదని, మిగతా జిల్లాల్లో మాత్రం టెన్త్ పరీక్షలు నిర్వహించొచ్చని హైకోర్టు శనివారం సాయంత్రం తీర్పు చెప్పింది. అయితే అలా వేర్వేరుగా పరీక్షల నిర్వహణ సాధ్యం కాదని భావించిన ప్రభుత్వం శనివారం రాత్రి అనూహ్యంగా పరీక్షలను మరోసారి వాయిదా వేసింది. సీఎం కేసీఆర్‌తో సమావేశమై తదుపరి నిర్ణయం తీసుకుంటామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి సోమవారం పరీక్షల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై సమీక్షించి టెన్త్ పరీక్షలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
గ్రేడింగ్ ఇలా..
సాక్షి, హైదరాబాద్: పదో తరగతి పరీక్షలను రద్దు చేసి ఇంటర్నల్ మార్కుల ఆధారంగా విద్యార్థులకు గ్రేడింగ్ ఇవ్వాలన్న ప్రభుత్వ నిర్ణయంతో ఈసారి టెన్త్ విద్యార్థులంతా పాస్ కానున్నారు. ముఖ్యంగా ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు ఇంటర్నల్స్‌లో 20కి 20 మార్కులు వేస్తుండటంతో దాదాపు 80 శాతం మంది విద్యార్థులకు 10/10 జీపీఏ లభించనుండగా విద్యార్థుల వాస్తవ ప్రతిభ ఆధారంగా ఇంటర్నల్ మార్కులను వేసే ప్రభుత్వ స్కూళ్లలో మాత్రం విద్యార్థులకు కాస్త తక్కువ గ్రేడ్లు రానున్నాయి. రాష్ట్రంలో 2014లో అమల్లోకి తెచ్చిన నిరంతర సమగ్ర మూల్యాంకనం (సీసీఈ) ప్రకారం 9, 10 తరగతుల్లో త్రైమాసిక, అర్ధ వార్షిక, వార్షిక పరీక్షల విధానాన్ని తొలగించి నిర్మాణాత్మక మూల్యాంకనం (ఫార్మెటివ్ అసెస్‌మెంట్–ఎఫ్‌ఏ), సంగ్రహణాత్మక మూల్యాంకనం (సమ్మెటివ్ అసెస్‌మెంట్–ఎస్‌ఏ) విధానం కొనసాగుతోంది.
ఒక విద్యా సంవత్సరంలో నాలుగు ఎఫ్‌ఏలు, రెండు ఎస్‌ఏలు నిర్వహించేలా విద్యాశాఖ చర్యలు చేపట్టింది. అలాగే 2015లో పదో తరగతి వార్షిక పరీక్షల్లో ఇంటర్నల్ మార్కుల విధానాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 20 మార్కులు ఇంటర్నల్స్‌కు ఇచ్చి 80 మార్కులకు రాత పరీక్ష నిర్వహిస్తోంది. ఇంటర్నల్స్‌లో ఒక్కో ఎఫ్‌ఏకు 20 మార్కుల (ప్రతి సబ్జెక్టులో) చొప్పున నాలుగు ఎఫ్‌ఏలు ఉంటాయి. ప్రతి ఎఫ్‌ఏ మార్కులను (20 మార్కులను) ఐదు మార్కులకు (ప్రతి సబ్జెక్టులో) పాఠశాలలు కుదిస్తాయి. ఇలా నాలుగు ఎఫ్‌ఏలలో మార్కులను 20 నుంచి 5 మార్కులకు కుదిస్తాయి. అంటే నాలుగు ఎఫ్‌ఏలు.. ఒక్కో దానికి 5 మార్కుల చొప్పున 20 అవుతాయి. ప్రతి సబ్జెక్టులో అలా వచ్చిన 20 మార్కులను విద్యార్థుల ఇంటర్నల్ మార్కులుగా పాఠశాలలు పదో తరగతి పరీక్షల విభాగానికి పంపుతాయి. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి 2019 జూలై, ఆగస్టు, నవంబర్, 2020 జనవరిలలో ఎఫ్‌ఏలను నిర్వహించగా ఆయా పరీక్షల్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఇంటర్నల్ మార్కులను స్కూళ్లు పరీక్షల విభాగానికి పంపాయి.
100 మార్కులుగా ఇంటర్నల్స్ మార్కులు పరిగణన..
ఇప్పుడు ఒక్కో విద్యార్థికి ప్రతి సబ్జెక్టలో ఉన్న 20 ఇంటర్నల్ మార్కులను 100 మార్కులుగా పరిగణనలోకి తీసుకుంటారు. ఇక 20 మార్కుల్లో విద్యార్థులకు ఎంత శాతం మార్కులు వచ్చాయో వాటి పర్సంటేజీ ప్రకారం మార్కులను ఇస్తారు. ఉదాహరణకు ఒక విద్యార్థికి గణితంలో ఇంటర్నల్ మార్కులు 20కి 20 వేసి ఉంటే అతనికి గణితంలో 100 మార్కులతో ఏ–1 గ్రేడ్ (10 గ్రేడ్ పాయింట్ యావరేజ్–జీపీఏ) వస్తుంది. అలాగే అన్ని సబ్జెక్టుల్లో ఏ–1 వస్తే 10/10 జీపీఏ వస్తుంది. ఒకవేళ ఇంటర్నల్‌లో 18 మార్కులే వస్తే అతనికి 90 మార్కులు వచ్చినట్లు లెక్క. దాని ప్రకారం ఆ సబ్జెక్టులో ఏ–2 గ్రేడ్‌తో 9 పాయింట్ జీపీఏ వస్తుంది. మార్కుల పర్సంటేజీ ఆధారంగా గ్రేడ్, గ్రేడ్ పాయింట్ కేటాయిస్తారు.
ఇప్పటివరకు టెన్త్‌లో అమలు చేస్తున్న గ్రేడింగ్ విధానం.. (హిందీ మినహా)...
గ్రేడ్ మార్కుల పరిధి జీపీఏ
ఏ1 91–100 10
ఏ2 81–90 9
బీ1 71–80 8
బీ2 61–70 7
సీ1 51–60 6
సీ2 41–50 5
Comments
Please login to add a commentAdd a comment