దశలవారీగా నగదురహితం
- ముందు పట్టణాల్లో,తర్వాత గ్రామాల్లో
- 60 శాతం లక్ష్య సాధనకు కృషి
- ప్రభుత్వానికి టాస్క్‌ఫోర్స్ నివేదిక
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒకేసారి నగదురహితం సాధ్యం కాదని, దాన్ని దశలవారీగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని టాస్క్‌ఫోర్స్ కమిటీ నివేదించింది. నగదురహిత లావాదేవీలపై ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్ కమిటీ 10 రోజుల్లో అధ్యయనం పూర్తి చేసి ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. నగదు రూపం లో పెద్ద మొత్తంలో జరిగే లావాదేవీలన్నిం టినీ ముందుగా నగదురహితంగా మార్చాలని సూచిం చింది. ‘‘సమాజాన్ని నగదురహితం చేయడం ఒకే సారి సాధ్యం కాదు. ముందుగా పట్టణ ప్రాంతాల్లో అమలు చేసి, దశలవారీగా గ్రామీణ ప్రాంతాలకు విస్తరింపజేస్తే సరైన ఫలితముంటుంది.
భారీ స్థాయి లో నగదు లావాదేవీలు జరిగేది పట్టణ ప్రాంతాల్లోనే గనుక అక్కడే ముందుగా అమలు చేస్తే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్లొచ్చు’’ అని అభిప్రాయపడింది. పెద్ద నోట్ల రద్దు తర్వాత తెలంగా ణలో నగదురహిత లావాదేవీలను ప్రోత్సహించేం దుకు చేపట్టాల్సిన చర్యలపై అధ్యయనానికి ప్రభుత్వం టాస్క్‌ఫోర్స్ కమిటీ వేయడం తెలిసిందే. పలు దఫాల సమావేశాల తర్వాత ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్రకు కమిటీ నివేదిక అందజేసింది. అందులోని ముఖ్యాంశాలు...
60 శాతం నగదురహితం లక్ష్యం
► నెట్ బ్యాంకింగ్, కార్డులు, మొబైల్ సేవలతో పాటు చెక్కులను ఉపయోగించాలి. అధిక విలువ కలిగిన లావాదేవీలపై ప్రభుత్వం ముందుగా దృష్టి సారించాలి. దీంతో 60 శాతం మొత్తం లెక్కలోకి, పన్నుల పరిధిలోకి వస్తుంది.
► ప్రధానంగా పట్టణ ప్రాంతాలపై దృష్టి కేంద్రీకరించాలి...
► నగదురహిత లావాదేవీలకు అవసరమైన మౌలిక సదుపాయాలతో పాటు డిజిటల్ అక్షరాస్యత పట్టణాల్లో ఉన్నందున అమలు సులభం. గ్రామాల్లో జరిగే లావాదేవీలు తక్కువే.
► పట్టణ ప్రాంతాల్లో నగదురహిత లావాదేవీలు ఎక్కువగా సాగితే ఉన్న నగదును గ్రామీణ ప్రాంతాలకు తరలించవచ్చు. గ్రామీణ ప్రాంతాల్లో ముందుగా అందరికీ బ్యాంకు ఖాతాలుండేలా చూడాలి. వారందరికీ రూపే కార్డులిచ్చి పని చేసేలా చూడాలి. ప్రభుత్వం, బ్యాంకర్లు రూపే కార్డులను ప్రోత్సహించాలి.
► బ్యాంకు ఖాతాలున్న ప్రతిఒక్కరికీ రూపే కార్డులు తప్పనిసరిగా ఉండేలా చూడాలి
► డిజిటల్ అక్షరాస్యతపై అవగాహన కల్పించాలి
► చౌకధర దుకాణాల్లో పాయింట్ ఆఫ్ సేల్స్ యంత్రాలను అమలు చేయాలి
► మార్కెట్ యార్డుల్లో రైతుల ఉత్పత్తులకు చేసే చెల్లింపులను బ్యాంక్ ఖాతాల్లోనే జమచేయాలి
► వంట గ్యాస్ సిలిండర్‌కు చెల్లింపులు నగదు రహితంగానే జరిగేలా చూడాలి
► ముందుగా ప్రభుత్వ లావాదేవీల్లో నగదురహిత విధానాన్ని అమల్లోకి తేవాలి
► రూ.500కు మించి ప్రభుత్వం చేసే, ప్రభుత్వానికి చేసే చెల్లింపులన్నీ డిజిటల్ పద్ధతిలో జరగాలి
►ఆన్‌లైన్‌లో విద్యుత్, మంచినీటి బిల్లుల చెల్లింపులపై సర్వీస్ చార్జీలను తొలగించాలి
►80 శాతం వరకు ప్రభుత్వ లావాదేవీలన్నీ నగదురహితంగా జరిగేలా చర్యలు తీసుకోవాలి
► ప్రైవేట్ రంగంలోనూ అధిక విలువ కలిగిన లావాదేవీలు నగదురహితంగా జరిపేలా ప్రోత్సహించాలి
► రూ.5,000కు మించిన కొనుగోళ్లు.. రూ.1,000కి మించిన చెల్లింపులు నగదురహితంగా జరిగేలా చూడాలి
► నగదురహిత లావాదేవీల అమలు, పర్యవేక్షణకు జిల్లా, మండల స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేయాలి
► ఆన్‌లైన్, మొబైల్ సేవల్లో మోసాలు, అన్యాయాలు జరగకుండా ప్రజలకు అవగాహన కల్పించాలి