రేపు కొడకంచికి కేసీఆర్
- వంద కోట్లతో నిర్మించిన ఆటో మొబైల్ పరిశ్రమ ప్రారంభం
- ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి హరీశ్‌రావు
జిన్నారం: ముఖ్యమంత్రి కేసీఆర్ జిన్నారం మండలంలో శనివారం పర్యటించనున్నారు. కొడకంచిలో సుమారు వంద కోట్లతో నిర్మించిన డక్కన్ ఆటో మొబైల్ పరిశ్రమను ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత ఏర్పాటైన మొదటి పరిశ్రమ ఇదే కావడం గమనార్హం. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గురువారం పర్యవేక్షించారు. మంత్రితోపాటు కలెక్టర్ రాహుల్‌బొజ్జా, ఎస్పీ సుమతి, పటాన్‌చెరు ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ భూపాల్‌రెడ్డి పరిశ్రమలో పర్యటించారు.
మంత్రి హరీశ్‌రావు సంబంధిత పరిశ్రమ యాజమాన్యంతో మాట్లాడి ఇక్కడ నిర్వహించే కార్యక్రమాలను తెలుసుకున్నారు. పరిశ్రమ ఆవరణలో సీఎం కేసీఆర్ మొక్కలను నాటే స్థలాన్ని కూడా మంత్రి పరిశీలించారు. సుమారు ఐదెకరాల స్థలంలో మొక్కలను నాటేందుకు పరిశ్రమ యాజ మాన్యం చర్యలు తీసుకోవటం అభినందనీయమన్నారు. ఇందుకు సంబంధించిన పనులను త్వరగా పూర్తి చేయాలని మంత్రి ఫారెస్ట్, స్థానిక అధికారులను ఆదేశించారు.
అనంతరం జిన్నారంలోని గిరిజన గురుకుల పాఠశాలలో సీఎం మొక్కలను నాటేందుకు సైతం ఏర్పాట్లను మంత్రి పరిశీలించారు. ఇదిలా ఉండగా మంత్రి హరీశ్‌రావుకు స్వాగతం పలికేందుకు విద్యార్థులు రావటంతో, విద్యార్థులకు విద్యను బోధించాలని, ఇలాంటి కార్యక్రమాలను చేయించొద్దని మంత్రి సూచించారు. ఈ కార్యక్రమంలో ఆయా శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మంత్రి దృష్టికి సమస్యలు
గిరిజన గురుకుల పాఠశాలలో నెలకొన్న సమస్యలను మంత్రి హరీశ్‌రావు స్వయంగా తెలుసుకున్నారు. పాఠశాలకు ప్రహరీగోడ లేకపోవటం, నీటి సమస్య తదితర సమస్యలను పాఠశాల ప్రిన్సిపల్ శశికళ మంత్రి దృష్టికి తెచ్చారు. సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని మంత్రి చెప్పారు.