విభజన లెక్కలు కొలిక్కి | State Division accounts to be cleared soon | Sakshi
Sakshi News home page

విభజన లెక్కలు కొలిక్కి

Published Sun, Apr 6 2014 3:22 AM | Last Updated on Tue, Oct 2 2018 4:01 PM

State Division accounts to be cleared soon

ఫైళ్లు, స్థిరాస్తులు, చరాస్తుల లెక్కలు పూర్తి
చరాస్తుల సంఖ్య 1,23,200
స్థిరాస్తుల సంఖ్య 29,700
మొత్తం ఫైళ్లు 19.20 లక్షలు

సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు సంబంధించి పలు రంగాల్లో లెక్కలు ఓ కొలిక్కి వస్తున్నాయి. ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన కీలకమైన ఫైళ్లు, చరాస్తులు, స్థిరాస్తులు, కోర్టు కేసులు, చట్టాలు, నిబంధనలు, వాహనాల లెక్కలను అన్ని శాఖలు ఇప్పటికే సేకరిం చాయి. ఆ లెక్కలను అధికారులు గుడ్ గవర్నెన్స్ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. దీంతో విభజనకు సంబంధించి తొలి అంకం ముగిసిట్లేనని అధికార వర్గాలు భావిస్తున్నాయి. ఇక ఏ రాష్ట్రానికి చెందిన ఫైళ్లను ఆ రాష్ట్రానికి విభజించే పనిని ఆయా శాఖలు ఇప్పటికే పూర్తి చేశాయి. ప్రధానంగా ఫైళ్ల విభజన విషయంలోనే జాప్యం జరుగుతోందని అధికార యంత్రాంగం తొలుత భావించినప్పటికీ.. ఊహించిన దానికన్నా ముందుగానే చాలా శాఖలు ఫైళ్ల విభజనను పూర్తి చేశారుు. కీలకమైన ఫైళ్లను స్కానింగ్ చేయడం ఒకటే మిగిలి ఉంది. ఆ ప్రక్రియను కూడా వారంలోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నారు. గుడ్ గవర్నెన్స్‌కు ఇప్పటివరకు అందిన విభజన లెక్కల ప్రకారం ఉమ్మడి రాష్ట్రంలో చరాస్తుల (కంప్యూటర్లు, కుర్చీలు, టేబుళ్లు, టెలిఫోన్లు, ఎయిర్‌కూలర్లు, ఫ్రిజ్‌లు మొదలైనవి) సంఖ్య 1,23,200గా లెక్క తేలింది.
 
 ఇక స్థిరాస్తుల (భూములు, భవనాలు తదితరాలు) సంఖ్య 29,700గా తేలింది. మొత్తం ప్రభుత్వ వాహనాల సంఖ్యను 19,628గా, ఉమ్మడి రాష్ట్రానికి సంబంధించిన చట్టాలు, రూల్స్ 6,300గా, ప్రభుత్వానికి చెందిన కోర్టు కేసులు 30 వేలుగా లెక్కకట్టారు. వీటిని కూడా ఏ రాష్ట్రానికి చెందిన వాటిని ఆ రాష్ట్రానికి విభజించే పని కొనసాగుతోంది. ఇలావుండగా అన్ని శాఖలు, కార్పొరేషన్లు, వివిధ ప్రభుత్వ సంస్థల్లో కలిపి కరెంట్, డిస్పోజల్ ఫైళ్లు 19.20 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. వీటిని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి రాష్ట్రం వారీగా కూడా విభజించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement