హైదరాబాద్: రాజ్యాంగంలోని 243–ఐ అధికరణం ప్రకారం ప్రతి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘాన్ని తక్షణం ఏర్పాటు చేయా లని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్(సుపరిపాలన వేదిక) అధ్యక్షుడు, హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ రెడ్డప్పరెడ్డి కోరారు. గురువారం లక్డీకాపూల్‌లోని సుపరిపాలన వేదిక కార్యాలయంలో సంఘం కార్యదర్శి యం.పద్మనాభరెడ్డి, ఉపాధ్యక్షులు డాక్టర్ రావు చెలికానితో కలసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఆదాయంలో స్థానిక సంస్థలకు న్యాయమైన వాటా ఇవ్వడం, పంచాయతీల పన్ను, రుసుములతో వచ్చే ఆదాయాన్ని సక్రమంగా పంపిణీ చేయడం ద్వారా వాటిని ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఆర్థిక సంఘం దోహదపడుతుందని చెప్పారు.
తెలంగాణలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదలై మూడేళ్లు కావస్తున్నా అది పూర్తిస్థాయిలో కొలువుదీరలేదని ఆరోపించారు. కొత్త రాష్ట్రంలో ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తూ జీవో విడుదల చేసినా అధ్యక్షుడు, సభ్యులను నియమించలేదని విమర్శించారు. హైకోర్టు ఆదేశాల ప్రకారం రాష్ట్ర ఆర్థిక సంఘాన్ని నియమించాలని ప్రభుత్వాన్ని కోరారు. సుప్రీంకోర్టు చెప్పినట్టు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు 50 శాతానికి మించకుండా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త పంచాయతీరాజ్ బిల్లును ప్రజల ముందుంచి వారి సలహాలు తీసుకున్న తర్వాతే అసెంబ్లీలో చట్టం చేయాలని అన్నారు.
రాజ్యాంగం నిర్దేశించిన 29 అంశాలను పంచాయతీలకు బదిలీ చేయాలని కోరారు. మూడంచెల పాలనా వ్యవస్థలో చివరివైన స్థానిక సంస్థలు సామాన్యుల జీవితాలతో ముడిపడి ఉంటాయని తెలిపారు. పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయడానికి రాజ్యాంగాన్ని సవరించారని చెప్పారు. ఈ సవరణ స్థానిక సంస్థలను రాజ్యాంగబద్ధ సంస్థలుగా గుర్తించి, కోట్లాది మంది గ్రామీణుల జీవనస్థితులను మెరుగుపరచడానికి ఉద్దేశించిందని పేర్కొన్నారు.
పంచాయతీలు స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలుగా పనిచేయడానికి వీలు కల్పించాలని, ఇందుకనుగుణంగా 29 అంశాలను వాటికి బదిలీ చేయాల్సి ఉందని అన్నారు. ఆ విధంగా జరిగినప్పుడే 73వ రాజ్యాంగ సవరణ ఉద్దేశాలు నెరవేరినట్లు అవుతుందని చెప్పారు. పంచాయతీలకు అధికారాలు, నిధులు బదిలీ చేయకపోవడంతో ఉత్సవ విగ్రహాలుగా మిగిలాయని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీలకు నిధులు, విధులు, సిబ్బందిని ఇవ్వాల్సిన అవసరం ఉందని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment