రాష్ట్ర తొలి ఉద్యాన ప్రదర్శన షురూ
⇒ ప్రారంభించిన తెలంగాణ సీఎం కేసీఆర్
⇒ ‘చేను కబుర్లు’ రేడియో కార్యక్రమం కూడా..
⇒ రూ. వెయ్యి కోట్లతో గోదాములు నిర్మిస్తాం: మంత్రి హరీశ్‌రావు
⇒ సూక్ష్మసేద్యం సబ్సిడీపై మంత్రి పోచారాన్ని నిలదీసిన రైతులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మొదటి ఉద్యానశాఖ ప్రదర్శనను ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సోమవారం హైదరాబాద్ నెక్లెస్‌రోడ్డులోని పీపుల్స్ ప్లాజాలో ప్రారంభించారు. పూలు, పళ్లు, కూరగాయలతో ఏర్పాటు చేసిన స్టాళ్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మొబైల్ కూరగాయలను సరఫరా చేసే ఆటోల పంపిణీ కార్యక్రమంతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ‘చేను కబుర్లు’ అనే కొత్త రేడియో కార్యక్రమాన్ని కూడా ఆయన లాంఛనంగా ప్రారంభించారు.
అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ నిత్యం రైతులు ఎదుర్కొనే వ్యవసాయపరమైన సమస్యలకు పరిష్కారాలను రేడియోలో తెలంగాణ మాండలికంలో పాటలు, కథలు, నాటకాల రూపంలో చెబుతారన్నారు. ఇందుకోసం ఐదు కళాశాలల విద్యార్థులు రేడియో క్లబ్బులుగా ఏర్పడి వారి ప్రాంతాలకు చెందిన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఆకాశవాణి ద్వారా వినిపిస్తారన్నారు. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం హైదరాబాద్ ‘ఎ’ స్టేషన్ ద్వారా మధ్యాహ్నం 1.30 నుంచి 2 గంటల వరకు ప్రసారమవుతుందని, దీన్ని ఉపయోగించుకోవాలని రైతులను కేసీఆర్ కోరారు.
కాగా, రాష్ట్రంలో ఏడాదిలో రూ. వెయ్యి కోట్లతో 13 లక్షల మెట్రిక్ టన్నుల సామర్థ్యంగల గోదాములను ప్రతి మండలంలోనూ నిర్మిస్తామని మార్కెటింగ్‌శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ధర పడిపోయినప్పుడు రైతులు తమ ధాన్యాన్ని గోదాముల్లో ఆరు నెలల వరకు పెట్టుకోవచ్చన్నారు. దీనిపై రూ. 2 లక్షల వరకు రుణం కూడా పొందవచ్చన్నారు. నాబార్డు సాయంతో మరో రూ. వెయ్యి కోట్లతో కూడా గోదాముల నిర్మాణం చేపడతామన్నారు.
వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ఈ ఏడాది మార్చిలోగా వెయ్యి ఎకరాల్లో గ్రీన్‌హౌస్ చేపట్టాలనేది తమ లక్ష్యమని, రైతులకు ఉచిత సోలార్ పంపుసెట్లు అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామన్నారు. అయితే పోచారం ప్రసంగిస్తుండగా కొందరు రైతులు వేదికపైకి వచ్చి సూక్ష్మసేద్యానికి సబ్సిడీ విషయమై ఆయన్ను నిలదీశారు. సూక్ష్మసేద్యం పరికరాలను ఎస్సీ, ఎస్టీలకు 100 శాతం సబ్సిడీ, బీసీలకు 90 శాతం సబ్సిడీకి ఇస్తున్న ప్రభుత్వం ఇతరులకు 80 శాతం సబ్సిడీనే ఇస్తోందని, దీనివల్ల పేదలైన ఓసీలు నష్టపోతారన్నారు.
అందువల్ల ఇతరులకు కూడా 90 శాతం సబ్సిడీ అందించాలని కోరారు. దీంతో కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. మంత్రి సహా అధికారులు వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఇతర రైతులకు ఉన్న 80 శాతం సబ్సిడీని 90 శాతం ఇచ్చేందుకు సీఎంతో మాట్లాడి నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో రైతులు శాంతించారు. సభలో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి ప్రసంగించగా ఉప ముఖ్యమంత్రి మహమూద్ అలీ, డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, వ్యవసాయ కమిషనర్ ప్రియదర్శిని, ఉద్యాన కమిషనర్ వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. ఉద్యాన ప్రదర్శన ఈ నెల 31 వర కూ జరగనుంది.
ఫేస్‌బుక్, యూట్యూబ్‌లతో ఉద్యానశాఖ లింక్
ఉద్యానశాఖ చేపట్టే కార్యక్రమాలను ఫేస్‌బుక్, యూట్యూబ్‌లకు లింక్ చేశారు. వ్యవసాయశాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య దీన్నిప్రారంభించారు. ఉద్యానశాఖ ఏర్పాటు చేసిన స్టాళ్లను, సీఎం కార్యక్రమాన్ని, సభలో వక్తల ప్రసంగాలను యూట్యూబ్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు.