ఏజీ లేరు.. నాకు సంబంధం లేదు..  | State government indirectly sent the signals in the case of MLAs issue | Sakshi
Sakshi News home page

ఫుటేజీలు ఇవ్వలేం!

Published Wed, Mar 28 2018 2:28 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

State government indirectly sent the signals in the case of MLAs issue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ శాసన సభ్యత్వాల రద్దు వ్యవహారం మరో మలుపు తిరిగింది. ఈ కేసులో కీలకంగా మారిన వీడియో ఫుటేజీలను హైకోర్టుకు సమర్పించే అవకాశం లేదని రాష్ట్ర ప్రభుత్వం పరోక్షంగా సంకేతాలు పంపింది. సీసీ కెమెరా ఫుటేజీలు ఇవ్వడంపై అసెంబ్లీ తీర్మానం చేయలేదు గనుక.. వాటిని అందజేయలేమని ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) జె.రామచంద్రరావు మంగళవారం హైకోర్టుకు నివేదించారు.

వీడియో ఫుటేజీలు సమర్పిస్తామన్న ఏజీ హామీతో తనకు సంబంధం లేదని, తాను కేవలం ప్రభుత్వం తరఫున హాజరవుతున్నానని, అసెంబ్లీ తరఫున ఎవరు హాజరవుతారో తనకు తెలియదని పేర్కొన్నారు. అయితే ఏఏజీ వివరణపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఫుటేజీలు అందుబాటులో ఉన్నా కూడా కోర్టుకు సమర్పించని పక్షంలో.. అందులోని అంశాలు వ్యతిరేకంగా ఉన్నాయని భావించాల్సి ఉంటుందని స్పష్టం చేసింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుందని హెచ్చరించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అటు నల్లగొండ, అలంపూర్‌ అసెంబ్లీ స్థానాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన గెజిట్‌ నోటిఫికేషన్‌కు సంబంధించి పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. ఈ మేరకు విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేస్తూ.. న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు ఉత్తర్వులు జారీ చేశారు. 

ఏజీ లేరు.. నాకు సంబంధం లేదు.. 
తమ శాసన సభ్యత్వం రద్దుపై కాంగ్రెస్‌ నేతలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ హైకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. శాసన మండలి చైర్మన్‌ స్వామిగౌడ్‌ను గాయపరిచామన్న ఆరోపణలతో చర్యలు తీసుకున్న నేపథ్యంలో.. ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలను కోర్టు ముందుంచేలా ఆదేశించాలని వారు కోరారు. ఈ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్‌ బి.శివశంకరరావు విచారణ చేపట్టారు. దీనికి ప్రభుత్వం తరఫున హాజరైన అడ్వొకేట్‌ జనరల్‌ (ఏజీ).. అసెంబ్లీలో ఘటనకు సంబంధించిన వీడియో ఫుటేజీలు సమర్పిస్తామని కోర్టుకు హామీ ఇచ్చారు. అనంతరం ఈ నెల 22న మరోసారి విచారణ జరగగా.. అదనపు అడ్వొకేట్‌ జనరల్‌ (ఏఏజీ) రామచంద్రరావు హాజరయ్యారు.

ఫుటేజీ సమర్పించాలంటే అసెంబ్లీ తీర్మానం అవసరమని, అందుకు గడువు ఇవ్వాలని కోర్టును కోరారు. దీంతో గడువిచ్చిన న్యాయమూర్తి.. మంగళవారం విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఏఏజీ రామచంద్రరావు స్పందిస్తూ... అసలు ఈ వ్యవహారంలో అసెంబ్లీకి నోటీసులు జారీ చేసే న్యాయ పరిధి హైకోర్టుకు లేదని వివరించారు. ఈ కేసులో తాను అసెంబ్లీ తరఫున హాజరుకావడం లేదని, కేవలం ప్రభుత్వం తరఫునే హాజరవుతున్నానని చెప్పారు. సభ తరఫున ఎవరు హాజరవుతారో తనకు తెలియదన్నారు. అయితే ఫుటేజీ సమర్పిస్తామని ఏజీ హామీ ఇచ్చారు కదా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా... అప్పుడు ఏజీ ఇచ్చిన హామీతో తనకు సంబంధం లేదన్నారు. ఈ సమయంలో పిటిషనర్ల తరఫు న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఏజీ ఇచ్చిన హామీకి విలువ ఉంటుందని, ప్రభుత్వం కూడా శాసనవ్యవస్థలో భాగమని కోర్టుకు చెప్పారు. ఏజీ హామీకి ప్రభుత్వం, అసెంబ్లీ కట్టుబడి ఉండాల్సిందేనన్నారు. 

ఫుటేజీ సమర్పిస్తున్నారా.. లేదా..? 
ఏఏజీ వాదనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన న్యాయమూర్తి.. ఇంతకీ ఫుటేజీ సమర్పిస్తున్నారా? అని ప్రశ్నించారు. దాంతో అదనపు ఏజీ స్పందిస్తూ.. ఫుటేజీ ఇవ్వాలంటే అసెంబ్లీ తీర్మానం అవసరమని, తీర్మానం చేయలేదు కాబట్టి కోర్టుకు ఫుటేజీ ఇవ్వలేమని చెప్పారు. ఈ విషయాన్ని మెమో ద్వారా రాతపూర్వకంగా వివరించారా? అని న్యాయమూర్తి ప్రశ్నించగా.. తాను సభ తరఫున హాజరుకావడం లేదు కాబట్టి మెమో దాఖలు విషయంలో ఏమీ చెప్పలేనని ఏఏజీ పేర్కొన్నారు. దీనిపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘వీడియో ఫుటేజీ లభ్యమవుతున్నప్పటికీ దానిని కోర్టుకు సమర్పించని పక్షంలో.. ఆ వీడియో ఫుటేజీలోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నాయి కాబట్టే ఇవ్వడం లేదని భావించాల్సి ఉంటుంది.

ఇలా భావించవచ్చునంటూ 1968లో గోపాల్, కృష్ణాజీ కేత్కర్‌ వర్సెస్‌ మహ్మద్‌ హాజీ లతీఫ్‌ తదితరుల కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు స్పష్టం చేసింది. మీరు వీడియో ఫుటేజీలను సమర్పించని పక్షంలో.. ఆ ఫుటేజీలోని అంశాలు మీకు (అసెంబ్లీ కార్యదర్శికి) వ్యతిరేకంగా ఉన్నట్టు భావిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాల్సి ఉంటుంది..’’అని స్పష్టం చేశారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించారు. ఇందుకు నాలుగు వారాలు గడువు కావాలని ఏఏజీ కోరగా.. న్యాయమూర్తి తోసిపుచ్చారు. ఇప్పటికే తగినంత సమయమిచ్చామని, ఏప్రిల్‌ 3వ తేదీ నాటికి కౌంటర్లు దాఖలు చేయాల్సిందేనని స్పష్టం చేస్తూ.. విచారణను వాయిదా వేశారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement