సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లా పారిశ్రామికాభివృద్ధిలో తొలి అడుగు పడింది. టీఎస్ ఐపాస్ పేరుతో రాష్ట్ర ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానాన్ని వెల్లడించిన తెల్లారే అంతర్జాతీయ గుర్తింపు ఉన్న కంపెనీల ప్రతినిధులు జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ముందుకొచ్చారు. రుయా గ్రూపు కంపెనీ చైర్మన్ పవన్‌కుమార్ రుయా శనివారం రాచకొండ గుట్టల్లో పర్యటించారు. అక్కడ స్మార్ట్‌సిటీతో పాటు పలు పరిశ్రమలను ఏర్పాటు చేస్తామని, ఏడు దేశాలకు చెందిన కంపెనీల సహకారంతో రూ.20వేల కోట్ల పెట్టుబడులు పెట్టి 2వేల ఎకరాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని ఆయన వెల్లడించడం విశేషం.
దీనికి తోడు ఇదే రాచకొండ గుట్టల్లో గతంలో ప్రభుత్వం ప్రతిపాదించిన ఫిల్మ్‌సిటీ, స్పోర్ట్స్‌సిటీల ప్రతిపాదనలు కూడా ఉన్నతాధికారుల పరిశీలనలో ఉన్నాయని తెలుస్తోంది. రుయా కంపెనీ ప్రతిపాదనలు కూడా వీటికి తోడయితే రాచకొండ గుట్టలో పారిశ్రామిక రాజసం విలసిల్లుతుందని అధికార వర్గాలంటున్నాయి. అయితే, ఆ ప్రాంతంలో ఇప్పటికే ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్ పేరుతో బీడీఎల్ కంపెనీకి ఇచ్చిన భూములను వెనక్కు తీసుకునే ఆలోచనలో ప్రభుత్వం ఉందని తెలుస్తోంది.
ఇప్పటికే యాదాద్రి పవర్‌ప్లాంటు పేరుతో దేశంలోనే అతిపెద్ద థర్మల్ విద్యుత్ ప్లాంటు ఏర్పాటునకు ఇటీవలే సీఎం శంకుస్థాపన చేసిన సంగతి తెలిసిందే. మరోవైపు టీఎస్‌ఐపాస్ విడుదల చేసిన సందర్భంగా జిల్లాలో సిమెంటు, ఫార్మా పరిశ్రమలు ఏర్పాటు చేయడాన్ని ప్రాధాన్యతాంశంగా తీసుకుంటామని ప్రభుత్వం ప్రకటించడంతో జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై ఆశలు పెరుగుతున్నాయి.
‘ఫీల్డ్’ కథ ఇది..
నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల సరిహద్దులో సుమారు 35వేల ఎకరాల్లో రాచకొండ అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. కేంద్ర ప్రభుత్వం 1982లో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌ను నల్లమల అడవుల్లో ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. వన్యమృగాలకు తోడు...హైదరాబాద్‌కు దూరంగా ఉందన్న కారణాలతో అక్కడ నుంచి విరమించుకున్నారు. రాష్ట్ర రాజధానికి చేరువలోని రాచకొండ గుట్టల్లో ఫైరింగ్ రేంజ్ ఏర్పాటుకు ప్రతిపాదనలు వచ్చాయి. సరిగ్గా 13 ఏళ్ల క్రితం అంటే... 1992లో రక్షణశాఖ అధికారులు రాచకొండ గుట్టలను పూర్తిగా సర్వే చేశారు. సుమారు 35వేల ఎకరాలకు సరిహద్దులు కూడా గుర్తించారు.
సంస్థాన్‌నారాయణపురంతో పాటు చౌటుప్పల్, మర్రిగూడ, రంగారెడ్డి జిల్లా మంచాల మండలాల సరిహద్దులను గుర్తించారు. అయితే, అప్పుడు అన్ని వర్గాల నుంచి వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని వెనక్కి తగ్గారు. అయితే వివిధ కారణాల వల్ల మళ్లీ 2003లో రాచకొండ గుట్టల్లోనే ఫీల్డ్‌ఫైరింగ్ రేంజ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. మళ్లీ వ్యతిరేకతలు వచ్చినా కేంద్ర ప్రభుత్వం ఫైరింగ్‌రేంజ్ ఏర్పాటు ప్రయత్నాలను ముమ్మరం చేసింది. అప్పటి నుంచి రాజకీయ పక్షాలు, ప్రజా సంఘాలు దీనికి వ్యతిరేకంగా పోరాడుతూనే ఉన్నాయి. వైఎస్ హయాంలోనే ఈ ప్రాజెక్టును అవిభక్త ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు తరలిస్తున్నట్టు ప్రకటించారు.
పారిశ్రామిక కారిడార్‌కు సదవకాశం
రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో రాచకొండ గుట్టల్లో 42వేల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయి. ఈ ప్రాంతమంతా శంషాబాద్ విమానాశ్రయానికి చేరువలో ఉంది. దీంతో ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని ఇండస్ట్రియల్ కారిడార్‌గా అభివృద్ధిచేసే యోచనలో ఉంది. అందులో భాగంగా ముశ్చర్లలో ఫార్మాసిటీకి 11వేల ఎకరాల భూములను ప్రభుత్వం ఇటీవలే కేటాయించింది. ఇదే క్రమంలో రాచకొండకు హైదరాబాద్ నుంచి, శంషాబాద్ నుంచి నాలుగులేన్ల రోడ్లను ఏర్పాటు చేసి, పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని యోచిస్తోంది. క్లస్టర్లుగా విభజించి ఓ క్లస్టర్‌లో 2వేల ఎకరాల్లో ఫిలింసిటీ మిగిలిన వాటిలో స్పోర్ట్స్‌సిటీ, ఎడ్యుకేషన్‌హబ్ పేరుతో ప్రతి ష్టాత్మకమైన విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
1.30లక్షల ఎకరాల భూములు
జిల్లాలో ఇప్పటికే ప్రభుత్వ భూముల సర్వే పూర్తయింది. మొత్తం జిల్లా వ్యాప్తంగా 1.30 లక్షల ఎకరాల భూములున్నాయని అధికార యంత్రాంగం గుర్తించింది. రాచకొండ, దిలావర్‌పూర్ అటవీరేంజ్‌లను మినహాయించి ఈ భూముల సర్వే జరిగింది. ప్రభుత్వ భూము ల్లో మొత్తం 4వేల ఎకరాల వరకు పారిశ్రామిక అవసరాలకు ఉపయోగపడే భూములున్నా యి. ఈ భూముల్లో పరిశ్రమల ఏర్పాటుకు ఎలాంటి అవాంతరాలు లేవని, మరో 5వేల ఎకరాల్లో చిన్న చిన్న సమస్యలను తొలగిస్తే పరిశ్రమలను ఏర్పాటు చేసుకోవచ్చని తెలుస్తోంది. ఈ మేర కు అధికారులు నివేదికలు కూడా పంపారు.
మేం సిద్ధంగా ఉన్నాం : జేసీ సత్యనారాయణ
జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు ఏ కంపెనీ ముందుకొచ్చినా సహకరించేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికే భూముల సర్వే పూర్తి చేసి పరిశ్రమల ఏర్పాటుకు అవసరమైన భూములను కూడా గుర్తించాం. ఈ మేరకు టీఎస్‌ఐడీసీకి నివేదిక పంపాం.
కదలిక...!
Published Sat, Jun 13 2015 11:21 PM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM
Advertisement
Advertisement