మీడియాకు ఆంక్షల సంకెళ్లు!
* సచివాలయంలో పాత్రికేయులకు నో ఎంట్రీ
* విధులకు ఆటంకంగా మారారనే సాకుతోనే...
* ఢిల్లీ బాటలో రాష్ట్ర సర్కారు
* సీఎం భేటీలో సూత్రప్రాయ నిర్ణయం
మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సచివాలయంలో మీడియాకు ‘నో ఎంట్రీ’.. అంటూ ఎన్నడూ లేని ఆంక్షలు విధిం చేందుకు సిద్ధమైంది. రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నారనే సాకుతో పాత్రికేయులను లోపలకు రాకుండా అడ్డుకోవాలని భావిస్తోంది.
సాక్షి, హైదరాబాద్: మీడియా స్వేచ్ఛకు సంకెళ్లు వేయాలని తెలంగాణ రాష్ట్ర సర్కారు నిర్ణయించింది. సచివాలయంలో మీడియాకు ‘నో ఎంట్రీ’... అంటూ గతంలో ఎన్నడూ లేని ఆంక్షలు విధించేందుకు సిద్ధమైంది. రోజువారీ పరిపాలనా వ్యవహారాలకు ఆటంకం కలిగిస్తున్నారనే సాకుతో పాత్రికేయులను లోపలకు రాకుండా అడ్డుకోవాలని భావిస్తోంది. ఈ విషయంలో తమపై వ్యతిరేకత రాకుండా ఉండేందుకు వివిధ రాష్ట్రాల్లో అమలవుతున్న ఆంక్షలను ఆదర్శంగా చూపేందుకు సమాలోచనలు జరిపింది. సీఎం కేసీఆర్ గురువారం స్వయంగా పలువురు ఉన్నతాధికారులతో ఇదే అంశంపై ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాను సచివాలయంలోకి రానివ్వకూడదని సూచనప్రాయంగా నిర్ణయం తీసుకున్నట్లుగా తెలియవచ్చింది.
పొరుగు రాష్ట్రాల సాకు..
‘ఇటీవల ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన కేజ్రీవాల్ సర్కారు ‘భద్రత, రద్దీ, ప్రభుత్వ కార్యాలయాల్లో స్వేచ్ఛగా పనిచేసుకునేందుకు మీడియాను సెక్రటేరియట్‌లోకి అనుమతించొద్దని నిర్ణయించింది. నరేంద్రమోదీ గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు కూడా ఇదే విధానాన్ని అనుసరించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటకలో కూడా మీడియాను సెక్రటేరియట్‌లోకి అనుమతించట్లేదు. ఢిల్లీలో ప్రధానమంత్రి, ఇతర మంత్రులు ఉండే సౌత్ బ్లాక్, నార్త్ బ్లాక్‌లలోను అనుమతించట్లేదు. ఇదే పద్దతిన ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి మాత్ర మే మీడియాను అనుమతించాలని కొందరు ఉన్నతాధికారులు, ఇద్దరు కేబినెట్ మంత్రులు సీఎంతో జరిగిన భేటీలో అభిప్రాయపడ్డారు.
సీఎంకు అధికారుల ఫిర్యాదు..
మంత్రులు, ముఖ్య కార్యదర్శుల చాంబర్ల వద్ద అటు సందర్శకులు, ఇటు మీడియా ప్రతినిధులు నిత్యం ఉండటంతో రోజువారీ కార్యకలాపాలకు ఇబ్బంది కలుగుతోందనే దానిపై సమావేశంలో ప్రధానంగా చర్చ జరిగింది. ప్రభుత్వ కార్యక్రమాలకు సంబంధించి విధాన రూపకల్పన ప్రక్రియకు విఘాతం కలిగిస్తున్నారని... మంత్రులు, కార్యదర్శులు వెళ్లే లిఫ్టుల్లోకి చొరబడి ఇబ్బంది పెడుతున్నారని సీఎంకు ఫిర్యాదు చేశారు. సెక్రటేరియట్‌కు ఎవరు వచ్చినా వారు సీఎంను కలసి చర్చించారనే తప్పుడు వార్తలు, స్క్రోలింగ్‌లు ఇస్తున్నారనేది చర్చకు వచ్చినట్లు తెలిసింది.
భద్రతా సమస్యలపై నిఘా నివేదికలు...
నిఘా అధికారులు ఇచ్చిన నివేదిక సీఎం సమక్షంలో ప్రస్తావనకు వచ్చినట్లు తెలిసింది. మీడియా ప్రతినిధులమంటూ చాలా మంది సెక్రటేరియట్‌లోకి వస్తున్నారని... సీఎం కార్యాలయమైన సి-బ్లాక్ మొదలుకొని మంత్రుల చాంబర్ల వద్ద తిరుగుతున్నారని.. దీంతో భద్రతాపరమైన సమస్యలు వచ్చే అవకాశముందని ఇంటెలిజెన్స్ వర్గాలు అభిప్రాయపడినట్లు సమాచారం. ఇదే సమయంలో మీడియా మొత్తాన్ని నియంత్రించకుండా... కొంత మందిని మాత్రమే అనుమతించాలనే ప్రతిపాదన పరిశీలనకు వచ్చింది. కొందరిని అనుమతించి.. మరికొందరిని అనుమతించకపోతే మీడియా సంస్థల పట్ల అంతరం పెంచినట్లు అవుతుందనే వాదనలతో ప్రభుత్వం వెనకడుగు వేసింది.
ముఖ్యమంత్రి ముక్తాయింపు
‘ఇటీవల జరిగిన ముఖ్యకార్యదర్శుల భేటీలో చాలా మంది అధికారులు మీడియా ప్రతినిధులతో పడుతున్న బాధలు చెప్పుకున్నారు. పొద్దంతా విలేకరులు సెక్రటేరియట్‌లో పడిగాపులు పడాల్సిన అవసరం రాదు. ప్రెస్‌నోట్లు, ఫొటోలు, వీడియోలు వంటి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రభుత్వం తరఫున ఇంటర్‌నెట్ ద్వారా పంపిస్తారు. రాష్ట్రంలో 20 న్యూస్ చానళ్లు, 15 దినపత్రికలు, ఇతర పక్ష పత్రికలు, ఇంటర్‌నెట్ న్యూస్ వెబ్‌సైట్లున్నాయి.
ఈ సంస్థలకు చెందిన మీడియా ప్రతినిధులంతా దాదాపు 200 మందికిపైగా సెక్రటేరియట్‌లో కనిపిస్తున్నారు. విభజన తర్వాత రాష్ట్రప్రభుత్వానికి కేవలం 4 భవనాలే వచ్చాయి. పార్కింగ్ ప్లేస్, అధికారుల కార్యాలయాలు, మంత్రుల చాంబర్లు ఇరుకుగా మారాయి. అందుకే మీడియాను సెక్రటేరియట్‌లోకి అనుమతించకుంటేనే బెటర్...’ అంటూ సమావేశంలో తీర్మానించారు. విలేకరులను అనుమతించకుండా... ప్రభుత్వం తరఫున ఇచ్చే సమాచారం సకాలంలో సమగ్రంగా అందిస్తే సరిపోతుంది కదా... అని సీఎం చివరకు ముక్తాయింపు ఇచ్చినట్లు తెలిసింది.