సాక్షి, హైదరాబాద్: రైతులు పండించే పంటలకు లాభదాయక ధర అందించమే లక్ష్యంగా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి మార్కెట్ కమిటీ ఏర్పాటు కాబోతోంది. వ్యవసాయ, మార్కెటింగ్ శాఖల సమన్వయంతో రాష్ట్ర రైతు సమన్వయ సమితి నేతృత్వంలో కలసి పని చేయనున్న ఈ కమిటీ.. దేశంలో ఎక్కడ మంచి ధరలున్నాయో గుర్తించి ఆ ప్రకారం పంటను విక్రయించడంలో ప్రముఖ పాత్ర వహించనుంది.
ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు మార్కెట్ కమిటీ ఏర్పాటుపై వ్యవసాయ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. త్వరలోనే మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముందని అధికారులు చెప్పారు. కమిటీకి ప్రత్యేకంగా డైరెక్టర్‌ను నియమించాలని కూడా ప్రభుత్వం యోచిస్తోందని చెబుతున్నారు.
అంకాపూర్ ఆదర్శంగా..
నిజామాబాద్ జిల్లా అంకాపూర్ మార్కెట్ కమిటీ ఆదర్శంగా రాష్ట్ర మార్కెట్ కమిటీ ఏర్పాటు చేయా లని ప్రభుత్వం నిర్ణయించింది. రెండ్రోజుల క్రితం రైతు సమన్వయ సమితి సభ్యులు, వ్యవసాయాధికారుల సమావేశంలో సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా అంకాపూర్ అంశాన్ని ప్రస్తావించారు. అంకాపూర్ ప్రాంత రైతులు తమ పంటను ఎట్టి పరిస్థితుల్లో తక్కువ ధరకు అమ్ముకోరు. అంకాపూర్ మార్కెట్ కమిటీ నిర్దేశించిన విధంగానే నడుచుకుంటారు.
పంట కోత దశలో ఉన్నపుడే ఆ మార్కెట్ కమిటీ దేశంలోని వివిధ మార్కెట్లలో ధరలను ఇంటర్నెట్‌లో పరిశీలిస్తుంది. ఎక్కువ ధరలున్న ప్రాంతానికి వెళ్లి అక్కడి వ్యాపారులతో చర్చించి ఒప్పందం కుదుర్చుకుంటుంది. పంట కోతలు పూర్తవగానే వ్యాపా రులు అంకాపూర్‌కు వచ్చి పంటను కొనుగోలు చేసి తీసుకెళ్తారు. రైతులకు అక్కడికక్కడే ధర చెల్లిస్తారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో కమిటీ కూడా అలాగే పని చేస్తుందని అధికారులు చెబుతున్నారు.
రైతు సమితులే కీలకం
రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంలో కృషి చేయడానికి గ్రామ, మండల, జిల్లా, రాష్ట్రస్థాయిలో రైతు సమితులను ప్రభుత్వం ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఇందులో 1.62 లక్షల మంది సమితి సభ్యులున్నారు. పంటకు ధర రాని సమయంలో మండల సమన్వయ సమితులు రంగంలోకి దిగుతాయి. రాష్ట్ర స్థాయి కమిటీకి పరిస్థితి వివరిస్తాయి.
రాష్ట్ర స్థాయి కమిటీ దేశంలో ధరల పరిస్థితిని అంచనా వేసి, ఏ పంట ఎక్కడ ఎక్కువ ధర పలుకుతుందో గుర్తించి ఆ ప్రకారం పంటను విక్రయిస్తుంది. దీనికి సంబంధించి విధివిధానాలు ఖరారయ్యాకే స్పష్టత వస్తుందని అధికారులు చెబుతున్నారు. కాగా, రాష్ట్రంలో ప్రస్తుతం మార్కెటింగ్ శాఖ, ఆ శాఖకు హరీశ్‌రావు మంత్రిగా ఉన్నా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా మరో మార్కెట్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేస్తుండటం గమనార్హం.
Comments
Please login to add a commentAdd a comment