
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రజాస్వామ్యయుత పాలన కావాలో.. రాచరిక పాలన కొనసాగాలో తెలంగాణ ప్రజలు ఆలోచించాలని మల్కాజ్‌గిరి లోక్‌సభ సభ్యుడు ఎ.రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలపై తెలంగాణ అమరవీరుల కుటుంబాల సభ్యులు ఆలోచించాలని ఆయన కోరారు. సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క ఇందిరాపార్కు వద్ద చేపట్టిన ఆమరణదీక్ష ఆదివారం రెండో రోజు కూడా కొనసాగింది. ఈ దీక్షకు సంఘీభావం తెలిపేందుకు వచ్చిన రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ 12 మంది ఎమ్మెల్యేలను తీసుకుంటేనే అంతా అయిపోయిందని టీఆర్‌ఎస్, సీఎం కేసీఆర్ అనుకుంటున్నారని ఎద్దేవా చేశారు.
అయినా పార్టీ మారామని చెప్పిన ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వాళ్లు ఎలా అవుతారని, సీఎల్పీని టీఆర్‌ఎస్‌లో ఎలా విలీనం చేస్తారని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ అప్రజాస్వామిక విధానాలకు నిరసనగానే ఎమ్మెల్యేల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌కు 95 లక్షల ఓట్లు వస్తే పార్లమెంటు ఎన్నికల్లో 75 లక్షలకు పడిపోయాయని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో కూడా 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను తీసుకున్న టీడీపీకి తర్వాతి అసెంబ్లీ ఎన్నికల్లో అవే ఎమ్మెల్యేలు, ఎంపీ స్థానాలు వచ్చాయని, ఆంధ్రప్రదేశ్ ఫలితాలు తెలంగాణలోనూ పునరావృతమవుతాయని రేవంత్‌రెడ్డి చెప్పారు.
దీక్షాశిబిరానికి వచ్చి సంఘీభావం తెలిపిన ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిపోతే నష్టపోయేది అమాయకులేనని అన్నారు. దళితుడ్ని సీఎం చేస్తానని చెప్పిన కేసీఆర్ ఇప్పుడు దళితుడు ప్రతిపక్ష నేతగా ఉండడం ఇష్టంలేకే ఆ హోదా కూడా తీసేస్తున్నారని ఆరోపించారు. భట్టికి లభించే గౌరవమే దళితులకు లభించే గౌరవమని చెప్పారు. తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు డాక్టర్. చెరుకు సుధాకర్ మాట్లాడుతూ అరాచకానికి దేశంలోనే సరికొత్త నిర్వచనం కేసీఆర్ అని అన్నారు. ప్రొఫెసర్ కంచ ఐలయ్య మాట్లాడుతూ కేసీఆర్ తెలంగాణలో అప్రజాస్వామిక వాతావరణం తెచ్చారని ఆరోపించారు. కేసీఆర్‌కు ఉద్యమ లక్షణం ఒక్కటి ఉన్నా సీఎల్పీ విలీనాన్ని ఆపాలని అన్నారు.
అది దుర్మార్గం: రాజగోపాల్‌రెడ్డి
రాజకీయాలను భ్రష్టు పట్టించేవిధంగా కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవడం దుర్మార్గమని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. కార్యకర్తలెవరూ అధైర్యపడవద్దని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చి తీరుతుందని అన్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ పార్టీ మారిన 12 మంది ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ప్రజాఉద్యమం తీసుకువస్తామని చెప్పారు.
టీపీసీసీ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ మాట్లాడుతూ కేసీఆర్‌ను సీఎం చేసింది గాంధీభవనే అని, అదే రేపు ఆయన ప్రభుత్వాన్ని కూడా కూలుస్తుందన్నారు. రెండోరోజు దీక్షా కార్యక్రమంలో ఏఐసీసీ కార్యదర్శులు సలీం అహ్మద్, వంశీచంద్‌రెడ్డి, సంపత్‌కుమార్, భద్రాచలం ఎమ్మెల్యే పొడెం వీరయ్య, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బొల్లు కిషన్ తదితరులు పాల్గొన్నారు. భట్టి దీక్షకు మద్దతుగా కర్ణాటక ఉపముఖ్యమంత్రి కె.టి.పరమేశ్వరన్ శిబిరానికి వచ్చారు. భట్టి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్న ఆయన తన సంపూర్ణ సంఘీభావాన్ని ప్రకటించారు.
క్షీణిస్తున్న ఆరోగ్యం
రెండోరోజు ఆమరణ దీక్ష చేస్తున్న సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఆరోగ్యం క్షీణించింది. బీపీలో మార్పులు వస్తున్నాయని, షుగర్ లెవల్స్, ఎర్ర రక్తకణాలు పడిపోయాయని ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు వెల్లడించారని కాంగ్రెస్ పార్టీ వర్గాలు తెలిపాయి.