బుధవారం ప్రగతి భవన్‌లో సీఎం కేసీఆర్‌తో సమావేశమైన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ
సాక్షి, హైదరాబాద్: ‘కేరళ తరహాలో రాష్ట్రంలో సైతం నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ (ఎన్పీఆర్) పనులను నిలుపుదల చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు విజ్ఞప్తి చేశాం. ఎన్పీఆర్, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ ఇండియన్ సిటిజన్స్ (ఎన్‌ఆర్‌ఐసీ)కి ఏమాత్రం సంబంధం లేదని, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా దేశాన్ని తప్పుదోవపట్టిస్తున్నారని సీఎంకు తెలిపాం. ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని పేర్కొం టున్న కేంద్ర హోంశాఖకు సంబంధించిన వివిధ పత్రాలను రుజువులుగా ఆయనకు అందజేశాం.
నిర్ణయం తీసుకోవడానికి కేసీఆర్ రెండు రోజుల సమయం కోరారు. సీఎం సానుకూల నిర్ణయం తీసుకుంటారని భరోసా ఉంది’అని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పేర్కొన్నారు. ముస్లిం ఐక్య కార్యాచరణ సమితి ప్రతినిధి బృందంతో కలసి బుధవారం ఆయన ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను కలిశారు. రాష్ట్రంలో ఎన్పీఆర్ పనుల నిలుపుదల చేయాలని వినతి పత్రం అందజేశారు. అనంతరం అసద్ మాట్లాడుతూ.. మూడు గంటలకు పైగా సీఎంతో సమావేశం సాగిందన్నారు. ఆర్టీకల్ 131 ఆధారంగా కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలను రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాలు చేయవచ్చని సలహా ఇచ్చామన్నారు.
‘ఈ అశంపై ఒకే రకమైన ఆలోచన ధోరణి కలిగిన పార్టీలతో కేసీఆర్ మాట్లాడుతారన్నారు. అవసరమైతే అందరినీ ఆహ్వానించి బహిరంగ సభ కూడా నిర్వహిస్తారు. ఇది కేవలం ముస్లింల సమస్య కాదు.. యావత్ దేశానిది, రాజ్యాంగానిది అని సీఎం పదేపదే అన్నారు. మతాల పేరుతో ఓ చట్టం (సీఏఏ) రావడం దేశంలో ఇదే తొలిసారి’అని అసద్ తెలిపారు. ‘ఈ నెల 27న నిజామాబాద్‌లో తలపెట్టిన బహిరంగ సభకు అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించాలని సీఎం సూచించారు. రాష్ట్ర మంత్రులను ఈ సభకు పంపిస్తామని చెప్పారు. కాంగ్రెస్, సీపీఐ, సీపీఎంలను సభకు ఆహ్వానిస్తాం. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని స్వయంగా ఆహ్వానిస్తా’ఎంఐఎం అధినేత తెలిపారు.
సందేహాలు వ్యక్తం చేసే అధికారం...
‘రాష్ట్రంలో 29 శాతం జనాభాకే పుట్టిన తేదీ సర్టిఫికేట్లున్నాయి. ఎన్పీఆర్‌లో పుట్టిన తేదీ సర్టిఫికేట్ అడుగుతున్నారు. మిగిలిన వారు ఎక్కడి నుంచి తేవాలి?. ఎవరి పౌరసత్వంపై అయినా సందేహాలు వెల్లబుచ్చే అధికారాన్ని కింది స్థాయి అధికారులకు చట్టం కట్టబెట్టింది. ఎవరిదైనా పౌరసత్వానికి ఎవరైనా అభ్యంతరాలు తెలపవచ్చు. ఈ పరిస్థితుల్లో ఈ సందేహాలు, అభ్యంతరాలకు ప్రమాణాలు ఏమిటి? పౌరుడిని ఎవరు నిర్ణయిస్తారు?. తల్లిదండ్రులు ఎక్కడ పుట్టారో అడుగుతున్నారు. ఆధార్ అడుగుతున్నారు. దేశంలోని వంద కోట్ల ప్రజలు లైన్లలో నిలబడాల్సి వస్తుంది. అస్సాంలో 5.4లక్షల బెంగాలి హిందూవులకు పౌరసత్వం ఇచ్చి 5లక్షల బెంగాలి ముస్లింలకు ఎందుకు ఇవ్వరు?. 1948 చట్టం ప్రకారమే జనగణన జరగాలి’అని స్పష్టం చేశారు.
ఇవిగో ఆధారాలు...
‘ఎన్‌ఆర్‌ఐసీకి ఎన్పీఆర్ తొలి అడుగు అని కేంద్ర హోంశాఖ వార్షిక నివేదిక 2018–19లోని చాప్టర్ 15(4) పేర్కొంది. ఇదే విషయాన్ని 2014 నవంబర్ 26న అప్పటి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు స్వయంగా పార్లమెంట్‌లో ప్రకటించారు. అదే రోజు ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో(పీఐబీ) పత్రికా ప్రకటనలో దీనిని తెలియజేసింది. కేంద్ర హోంశాఖ వెబ్‌సైట్‌లోని సివిల్ రిజిస్ట్రేషన్ డివిజన్‌కు సంబంధించిన రెండో పేజీలో ఈ విషయం స్పష్టంగా రాసి ఉంది. ఇన్ని రుజువులున్నా ఎన్‌ఆర్‌ఐసీ, ఎన్పీఆర్‌కి సంబంధం లేదని కేంద్ర హోంమంత్రి తప్పుదోవపట్టిస్తున్నారు. సీఎంను కలసిన వారిలో ఎంఐఎం నేత అక్బరుద్దీన్ ఒవైసీ, ఆర్థికవేత్త అమీరుల్లాఖాన్, సినీ నిర్మాత ఇలాహీ, ముస్లిం పర్సనల్‌లా బోర్డు మహిళా విభాగం అధ్యక్షురాలు డాక్టర్ అస్మా తదితరులున్నారు.
Comments
Please login to add a commentAdd a comment