ఏడుపు ఆగుతుందనుకుంటే శ్వాసే ఆగింది
బషీరాబాద్: ఏడుస్తున్న బాలుడి రోదనలు ఆపడానికి ఆ తల్లి ట్రాక్టర్ మీద ఎక్కించింది. ట్రాక్టర్ కుదుపులకు గురైన బాలుడు అదుపుతప్పి టైరు కింద పడటంతో కానరాని లోకాలకు వెళ్లాడు. తల్లిదండ్రులకు తీరని దుఃఖం మిగిల్చిన ఈ ఘటన రంగారెడ్డి జిల్లా బషీరాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం చోటు చేసుకుంది. ఎస్సై అభినవ చతుర్వేది తెలిపిన వివరాల ప్రకారం.. మండల పరిధిలోని పర్వత్‌పల్లికి చెందిన కుర్వ బుజ్జమ్మ, పకీరప్ప దంపతులు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు.
వీరి కుమారుడు రాకేష్ (18 నెలలు) మధ్యాహ్నం గుక్కపట్టి ఏడుస్తున్నాడు. అదే గ్రామం పొరుగింటికి చెందిన డ్రైవర్ విజయ్‌కుమార్ ట్రాక్టర్ నడిపించుకుంటూ పర్వత్‌పల్లికి వచ్చాడు. బాలుడి ఏడుపు ఆపడానికి అతడిని బుజ్జమ్మ ట్రాక్టర్‌పైకి ఎక్కించింది. ఇంటి ముందు ట్రాక్టర్‌ను తిప్పుతుండగా ట్రాక్టర్ ఒక టైరు అప్పటికే పంక్చర్ అవడంతో కుదుపులకు గురై బాలుడు జారి కిందపడ్డాడు. దీంతో బాలుడు తలపై నుంచి ట్రాక్టర్ వెనుక చక్రం వెళ్లడంతో దుర్మరణం పాలయ్యాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న బాలుడి మృతితో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి.