శాలిగౌరారం: మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరుగురు విద్యార్థులను ఉపాధ్యాయులు చితకబాదారు. నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలం వల్లాల గ్రామంలోని ప్రభుత్వ మోడల్ స్కూల్‌లో జరిగిన ఈ ఘటన మంగళవారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ స్కూల్‌లో 708 మంది విద్యార్థులున్నారు. వారిలో 500 మంది పాఠశాల స్థాయిలో ఉండగా, మరో 208 మంది ఇంటర్ విద్యార్థులు. మోడల్ స్కూల్‌లో 8 మంది మహిళా టీచర్లు ఉన్నారు. పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థుల్లో ఆరుగురు విద్యార్థులు మహిళా ఉపాధ్యాయుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు తెలిసింది. దీంతో విద్యార్థులను ఉపాధ్యాయులు సోమవారం ప్రిన్సిపాల్ చాంబర్‌లోకి పిలిపించి విచారించారు. చాంబర్‌లోని సీసీ కెమెరాలను నిలిపివేసి ఉపాధ్యాయులు విద్యార్థులను కర్రలతో కొట్టారు. ఓ విద్యార్థికి తీవ్ర గాయాలు కావడంతో నడవలేని స్థితికి చేరుకున్నాడు. ప్రస్తుతం ఆ విద్యార్థి నకిరేకల్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. దీంతో విషయం వెలుగులోకి రావడంతో పాఠశాల వద్ద విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి, ఎంపీడీఓ లక్ష్మయ్య పాఠశాలను సందర్శించారు. విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు ఆందోళనను విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment