ఓయూ సీఎం ఫాంహౌస్ కాదు
- ముఖ్యమంత్రి ప్రకటనపై విద్యార్థుల నిరసన
- సీఎం దిష్టిబొమ్మ దహనం
- ఉద్యోగ సంఘాల ఆగ్రహం
ఉస్మానియా యూనివర్సిటీ: ముఖ్యమంత్రి కేసీఆర్ తన రాజకీయ ప్రయోజనాల కోసం ఉస్మానియా యూనివర్సిటీని ఇతరులకు ధారాదత్తం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, ఓయూపై ఆయన ప్రకటనలు మానుకోవాలని విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి ప్రకటనలకు నిరసనగా సోమవారం వివిధ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఏబీవీపీ ఆధ్వర్యంలో మెయిన్ గేట్ వద్ద సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆర్ట్స్ కళాశాల ఎదుట పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఓయూ విద్యార్థి నేతల అరెస్టు
ఖైరతాబాద్: ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్‌లో పేదలకు ఇళ్లు కట్టిస్తామని ముఖ్యమంత్రి చేసిన ప్రకటన ను వ్యతిరేకిస్తూ సోమవారం సచివాలయం వద్ద నిరసన తెలిపేందుకు వచ్చిన తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఓయు జేఏసీ నేతలను సైఫాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా నాయకులు కైలాస్‌నేత, మహ్మద్ ఇబ్రహిం, ఎ. ఉదయ్‌కుమార్, చరన్ కౌషిక్ యాదవ్ మట్లాడుతూ ముఖ్యమంత్రి రాజకీయ ప్రయోజనాలకోసం ఓయూను వాడుకుంటే సహించేది లేదన్నారు. అన్ని వర్గాల విద్యార్థులకు ఓయూ కేంద్రంగా ఉందని, క్యాంపస్‌లో భవనాలు కూలిపోవడానికి సిద్దంగా ఉన్నా పట్టించుకోకుండా ఇళ్లు నిర్మిస్తామంటే ఊరుకునేది లేదని హ్చురించారు. ఈ సందర్భంగా నిరసన తెలుపుతున్న 9మందిని సైఫాబాద్ పోలీసులు 151 సెక్షన్ కింద అరెస్ట్‌చేసి నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.