టీసీ కోసం తప్పని పడిగాపులు | Students Suffering Transfer Certificate In Hyderabad | Sakshi
Sakshi News home page

టీసీ కోసం తప్పని పడిగాపులు

Published Fri, Jun 29 2018 9:56 AM | Last Updated on Tue, Sep 4 2018 5:44 PM

Students Suffering Transfer Certificate In Hyderabad - Sakshi

సాక్షి, సిటీబ్యూరో: ‘యూసఫ్‌గూడకు చెందిన జోష్న రహమత్‌నగర్‌లోని న్యూటన్‌ హైస్కూల్లో తొమ్మిదో తరగతి వరకు చదివింది. ఈ ఏడాది మరో స్కూలుకు మారాల్సి వచ్చింది. దీంతో రెండు నెలల క్రితం ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్‌(టీసీ)కోసం దరఖాస్తు చేసింది. అయితే ఇప్పటి వరకు ఆమెకు టీసీ ఇవ్వలేదు. అదే మంటే డీఈఓ ఆఫీసు నుంచి ఇంకా రాలేదని చెప్పుతున్నారు. దీంతో ఇక్కడ చదవలేక..మరో స్కూల్లో అడ్మిషన్‌ పొందలేక ఇబ్బందిపడాల్సి వస్తుంది’ ఇలా జోష్న మాత్రమే కాదు..ఇలా అనేక మంది ఇదే సమస్యతో బాధపడుతున్నారు. నిజానికి విద్యాసంవత్సరం ప్రారంభంలో చాలా మంది విద్యార్థులు ఒక స్కూ లు నుంచి మరో స్కూల్‌కు మారుతుంటారు. వీరంతా ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికెట్లు(టీసీ)ల కోసం దరఖాస్తు చేసుకుంటారు. దరఖాస్తు చేసిన వారం రోజుల్లోనే టీసీ ఇవ్వాల్సి ఉన్నప్పటికీ అధికారుల నిర్లక్ష్యం వల్ల విద్యార్థులకు ఇబ్బందులు తప్పడం లేదు.   

అడ్మిషన్‌ చేజారిపోకుండాముందుజాగ్రత్తలు
హైదరాబాద్‌ జిల్లా పరిధిలో 684 ప్రభుత్వ పాఠశాలలు ఉండగా, వీటిలో 122510 మంది చదువుతుండగా, 294 ఎయిడెడ్‌ స్కూళ్లలో 56495 మంది చదువు తున్నారు. 2259 ప్రైవేటు స్కూళ్లు ఉండగా 579742 మంది చదువుతున్నారు. వీరిలో చాలా మంది పిల్లల తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి బదిలీపై వెళ్తుంటారు. అద్దె ఇళ్లలో ఉంటున్న మరికొంత మంది ఒక కాలనీ నుంచి మరోకాలనీకి మారుతుంటారు. ఇంకొంత మంది ఉత్తమ బోధనను అందిస్తున్న స్కూళ్లలో చేరుతుంటారు. పదోతరగతి పాసైన వారు పై చదువులకు వెళ్తుంటారు. వీరంతా టీసీల కోసం ఇప్పటికే దర ఖాస్తు చేసుకున్నారు. కొన్ని పాఠశాలలు ఇప్పటికే ఆయా విద్యార్థులకు టీసీలు ఇచ్చి పంపగా, మరికొన్ని నిరాకరిస్తున్నాయి. అదేమంటే పాఠశాల వద్ద టీసీ ధృ వపత్రాల బుక్‌ అయిపోయిందని, కొత్తబుక్‌ పంపించాల్సిందిగా ఇప్పటికే జిల్లా విద్యాశాఖకు దరఖాస్తు కూడా చేశామని, వారి నుంచి ఇంకా రాలేదని చెప్పిత ప్పించుకుంటారు. నిజానికి ప్రభుత్వ పాఠశాలల్లో ఈ సమస్య పెద్దగా లేనప్పటికీ....అడ్మిషన్‌ చేజారిపోకుండా అడ్డుకునేందుకు కొన్ని ప్రైవేటు పాఠశాలు ఇలా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు లేకపోలేదు.   

కొనసాగుతున్న సహాయ నిరాకరణ:  హైదరాబాద్‌ జిల్లా విద్యాశాఖ అస్తవ్యస్తంగా తయారైంది. ఈటీఆర్‌ల జారీపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ఇప్పటికే కొంత మంది అరెస్టైన సంగతి తెలిసిందే. ఎవరో ఒక్కరు చేసిన తప్పులకు అందరినీ బలిచేస్తున్నారని పేర్కొంటూ కార్యాలయ సిబ్బంది సహా డీఐఓలు, డిప్యూటీ డీఈఓలు ఉన్నతాధికారులకు సహకరించడం లేదు. దీంతో టీసీ బుక్‌ల జారీ సహా కీలకమైన ఫైళ్లన్ని పెండింగ్‌లో పడిపోయాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రైవేటు యాజామన్యాలే కాదు, ఉపవిద్యా శాఖాధికారులు కూడా జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి వెళ్లేందుకు వెనుక డుగేస్తున్నారు. ఈ పరిణామాలు ఇటు యాజమాన్యాలతో పాటు విద్యార్థుల తల్లిదండ్రులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఇదిలా ఉంటే ఉపాధ్యాయులకు, ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలకు నిత్యం అందుబాటులో ఉండాల్సిన జిల్లా విద్యాశాఖాధికారి మీటింగ్‌ల పేరుతోనిత్యం వారికి దూరంగా ఉంటుంది. అత్యవసర పరిస్థితుల్లో ఎవరైనా ఫోన్‌ చేసినా కనీసంస్పందించడం లేదనే ఆరోపణలు లేకపోలేదు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement