
సాక్షి, హైదరాబాద్: ఎస్సీ, ఎస్టీల తరహాలో బీసీలకు కూడా సబ్ ప్లాన్ అమలు చేయాలని బీసీ కమిటీ ప్రతిపాదనల్లో మొదటి అంశంగా చేర్చినట్లు బీసీ సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. మంగళవారం అసెంబ్లీలో స్పీకర్ మధుసూదనచారి, మంత్రి ఈటల రాజేందర్, పలువురు ఎమ్మెల్యేలతో సమావేశం నిర్వహించారు. అనంతరం సచివాలయంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్‌తో కలసి విలేకరులతో మాట్లాడారు. బీసీల జనాభాను కచ్చితంగా తేల్చేందుకు బీసీ కమిషన్ ఆధ్వర్యంలో త్వరలోనే సర్వే నిర్వహించనున్నామన్నారు.
బీసీల నైపుణ్యాభివృద్ధి శిక్షణ కోసం 100 ఎకరాల్లో పూలే పేరిట బీసీ ఆత్మగౌరవ భవన్‌ను ఏర్పాటు చేయాలని కమిటీలో నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 50 శాతం, ఎలక్టెడ్, సెలక్టెడ్ పోస్టుల్లో రిజర్వేషన్లు కల్పించాలని సీఎంకు నివేదించనున్నామన్నారు. 31 జిల్లాల్లో రెండేసి చొప్పున 62 డిగ్రీ, 62 జూనియర్ కాలేజీలను ఏర్పాటు చేయాలని నిర్ణయిస్తూ కమిటీ ప్రతిపాదించిందన్నారు. కొత్తగా మరో 119 బీసీ గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేయాలని, పారిశ్రామిక రంగంలో రిజర్వేషన్ కల్పించాలని, ఉద్యోగులకు పదోన్నతుల్లో రిజర్వేషన్లు కల్పించాలని ప్రతిపాదిస్తున్నామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment