
జంతు విసర్జనను పరిశీలిస్తున్న అటవీ శాఖ మంత్రి జోగు రామన్న
సాక్షి, హైదరాబాద్/ఉట్నూర్ రూరల్ (ఖానాపూర్): రాష్ట్రంలో పులులు, ఇతర అటవీ జంతువుల గణన ప్రారంభమైంది. నల్లమల, కవ్వాల్, బెల్లంపల్లి, తూర్పు కనుమలు తదితర అడవుల్లోని మూడు వేల ఫారెస్టు బీట్లలో అధికారులు సోమవారం ఏక కాలంలో జంతు గణన ప్రారంభించారు. దాదాపు 10 వేల మంది అటవీ, స్వచ్ఛంద సేవా సంఘాల సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఈ నెల 29 వరకు లెక్కలను సేకరిస్తారు. రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారి పీకే ఝా ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నారు. అధికారులు గతంలో పాద ముద్రల ఆధారంగా పులి కదలికలను, ఉనికిని గుర్తించేవారు.
ఇప్పుడు తొలిసారిగా ‘ఫేజ్4 మానిటరింగ్ విధానం’ ద్వారా పులులను లెక్కిస్తున్నారు. అంటే ఛాయా చిత్రాలు, పాద ముద్రలు, పెంటిక విశ్లేషణ, భౌతిక గమనం అనే నాలుగు అంశాల ఆధారంగా పులిని గుర్తిస్తారు. ఒక పులి చారలు, పాద ముద్రలు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరొక పులితో సరిపోలవు. వీటి ఆధారంగానే అటవీ శాఖ అధికారులు పులుల సంఖ్యపై స్పష్టతకు వస్తున్నారు. జంతు గణన వారం పాటు చేస్తారు. ఇందులో మూడు రోజులు వేటాడే జంతువులు(మాంసాహారులు) మూడు రోజులు శాఖాహార జంతువుల లెక్కలు సేకరిస్తారు. జాతీయ కార్యక్రమంలో భాగంగా ఈ జంతుగణన దేశవ్యాప్తంగా ఏకకాలంలో ప్రారంభమైంది. ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ ఏజెన్సీ ప్రాంతంలోని కొలాంగూడ, రాంపూర్ అటవీ బీట్‌లోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ (కేటీఆర్) ఫారెస్ట్‌లో అటవీ, బీసీ సంక్షేమ శాఖల మంత్రి జోగు రామన్న పులులు, వన్య జంతువుల గణనలో పాల్గొన్నారు. ఉదయం 6 నుంచి 8 గంటల వరకు అటవీ శాఖ అధికారులతో కలసి 6 కిలోమీటర్లు కాలినడకన పర్యటించి ఆయన జంతు గణనను పరిశీలించారు. వన్యప్రాణుల సంరక్షణ, వాటి సంఖ్యను పెంచడమే కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని మంత్రి అన్నారు.
చారలను సరిచూసి...
పులుల లెక్కింపులో ఇప్పుడు సీసీ కెమెరాలే కీలకంగా మారాయి. పులి శరీరానికి కుడి, ఎడమ వైపు ఉన్న చారలను కెమెరాలతో చిత్రీకరిస్తారు. చారల్లో ఉంటే తేడాల ఆధారంగా ఒక ఫొటోతో మరో ఫొటో సరిపోల్చుకుంటూ ఒక పులి నుంచి మరో పులిని వేరుగా గుర్తిస్తారు. రెండేళ్ల లోపు పులి కూనలను లెక్కలోకి తీసుకోరు. మరో పద్ధతిలో నీటి ముడుగుల సమీపంలో ఫారెస్టు అధికారులు తడిగా ఉండే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఫలకాలు పెడతారు. నీళ్ల కోసం వచ్చే పులి ఆ ఫలకాల మీద కాలు పెడితే అచ్చులు పడుతాయి. ఆ అచ్చుల ఆధారంగా కూడా పులులను లెక్కిస్తారు.
పెంటిక పరీక్ష...
పులులు సంచరించే అవకాశం ఉన్న ఆవాసంలో పెంటికల(పేడ) నమూనాలు సేకరిస్తారు. వాటికి సీసీఎంబీలో డీఎన్‌ఏ నిర్ధారణ పరీక్షలు చేస్తారు. అన్ని నమూనాల్లో ఒకే రకమైన డీఎన్‌ఏ ఉంటే పెంటికలు అన్ని ఒకే పులివి అని నిర్ధారిస్తారు. డీఎన్‌ఏలలో తేడా ఉంటే అక్కడ మరో పులి ఉన్నట్లు గుర్తిస్తారు. డీఎన్‌ఏ నిర్ధారణ పరీక్షల్లో 100 శాతం విశ్వసనీయత ఉంటుందని అధికారులు చెప్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment