
సాక్షి, సిటీబ్యూరో: సిటీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరుగుతోంది. ఈసారి ఫిబ్రవరి రెండో వారంలోనే వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకోవడం, పగటి ఉష్ణోగ్రతలు రోజురోజుకూ పెరుగుతుండటంతో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వారం రోజుల నుంచి రోజుకో మిలియన్ యూనిట్ చొప్పున విద్యుత్ వినియోగంపెరుగుతుండటంతో దక్షిణ తెలంగాణ విద్యుత్ పంపిణీ సంస్థ అధికారులు అలర్ట్ అవుతున్నారు. తాజాగా సోమవారం గ్రేటర్‌లో గరిష్టంగా 34 డిగ్రీలు, కనిష్టంగా 21 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గత ఏడాదితో పోలిస్తే పగటి ఉష్ణోగ్రతల పెరుగుదల ఈ సారి తక్కువే ఉన్నప్పటికీ.. విద్యుత్ వినియోగం భారీగా నమోదవుతుండటంపై ఆందోళన వ్యక్తమవుతోంది. పారిశ్రామిక రంగం కంటే ఎక్కువగా గృహ, వాణిజ్య సముదాయాల్లోనే విద్యుత్ వినియోగం అధికంగా నమోదవుతుంది.
డిమాండ్‌ను తట్టుకునే విధంగారూపకల్పన..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొమ్మిది సర్కిళ్లు ఉండగా, వీటి పరిధిలో 22 డివిజన్లు ఉన్నాయి. మొత్తం 54.10 లక్షల విద్యుత్ కనెక్షన్లు ఉండగా, వీటిలో 44.60 లక్షల గృహ, 6.95 వాణిజ్య, 41807 పారిశ్రామిక, 7321 హెచ్‌టీ కనెక్షన్లు ఉన్నాయి. గతంతో పోలిస్తే ప్రస్తుతం గ్రేటర్‌వాసుల సగటు విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. ఏసీలు, రిఫిజ్రిరేటర్లు, కంప్యూటర్లు, వాషింగ్ మిషన్లు, హీటర్లు ప్ర స్తుతం ప్రతి ఇంట్లోనూ సర్వసాధారణమయ్యాయి. గత వారం రోజుల వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వల్ల ఏసీ, కూలర్లు, రిఫ్రిజిరేటర్ల అవసరం పెద్ద గా రాలేదు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు పెరగడం, రాత్రిపూట ఉక్కపోస్తుండటం వల్ల ఫ్యాన్లు, ఏసీల వాడకం అనివార్యం కావడంతో ఆమేరకు విద్యుత్ విని యోగం రెట్టింపైంది. ఈ నెల మొదటి వారంలో రోజువారి సగటు విద్యుత్ వినియోగం 42 ఎంయూలు దాటలేదు. వాతావరణ మార్పుల వల్ల కేవలం వా రం రోజుల్లోనే సుమారు ఎనిమిది మిలియన్లు యూనిట్లకు చేరుకోవడం గమనార్హం.
68 ఎంయూలకు చేరుకోవచ్చు:శ్రీనివాసరెడ్డి, డైరెక్టర్, ఆపరేషన్స్, డిస్కం
భవిష్యత్తు విద్యుత్ అవసరాలకు తగ్గట్లుగా గ్రేటర్‌లో విద్యుత్ పంపిణీ వ్యవస్థను అభివృద్ధి చేశాం. తొమ్మిది సర్కిళ్ల పరిధిలో ఐదు 400 కేవీ సబ్‌స్టేషన్లు, ఇరువై 220 కేవీ, ముప్పై రెండు 132కేవీ సబ్‌స్టేషన్లు ఉన్నాయి. 33/11కేవీ సబ్‌స్టేషన్లు 444 వరకు ఉన్నాయి. ప్రస్తుతం వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల వల్ల ఏసీలు, కూలర్ల వినియోగం పెరుగుతోంది. ఆ మేరకు విద్యుత్ వినియోగం కూడా రెట్టింపవుతుంది. మార్చి చివరి నాటికి గ్రేటర్‌లో విద్యుత్ వినియోగం 65 నుంచి 68 మిలియన్ యూనిట్లకు చేరుకోన్నుట్లు అంచనా. అయితే ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వేసవి డిమాండ్ మేరకు ముందస్తు ఏర్పాట్లు చేశాం. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసేందుకు ఇప్పటికే సబ్‌స్టేషన్లను ఆధునీకరించడంతో పాటు లైన్లకు అడ్డుగా ఉన్న చెట్లను తొలగించడం, ట్రాన్స్‌ఫార్మర్ల పునరుద్ధరణ వంటి పనులు చేశాం.
Comments
Please login to add a commentAdd a comment