ఆదిలాబాద్ రిమ్స్ : జిల్లా కేంద్రంలోని రాజీవ్‌గాంధీ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైన్ (రిమ్స్) ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ సేవలందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకు గాను కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పీఎంఎస్‌ఎస్‌వై) పథకం కింద రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు చేసేందుకు అంగీకరించింది. ఇక రిమ్స్‌లో అత్యాధునిక పరికరాలతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. గత ఫిబ్రవరి నెలలోనే అప్పటి యూపీఏ ప్రభుత్వం ఈ పథకం కింద రిమ్స్‌ను సూపర్ స్పెషాలిటీ కింద ప్రకటించిన విషయం తెలిసిందే.
దేశంలో 39 వైద్య కళాశాలలు ఎంపిక చేయగా, మనరాష్ట్రంలో వరంగల్ కాకతీయ వైద్య కళాశాల, రిమ్స్ వైద్య కళాశాలలు ఉన్నాయి. వీటిలో సూపర్‌స్పెషాలిటీ సేవలు విస్తరించడం, ఆధునిక వైద్య సేవలు, నిర్ధారణ పరికరాలను అందుబాటులోకి తేవడం ఈ పథకం ముఖ్య ఉద్దేశం. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనలకు కేంద్రం ఆమోదం తెలపడంతో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఎనిమిదేళ్లుగా సరైన వైద్య సేవలు లేక కొట్టుమిట్టాడుతున్న రిమ్స్‌లో ఇక మంచి వైద్య సేవలందుతాయని పలువురు అభిప్రాయపడుతున్నారు.
రూ.150 కోట్ల నిధులతో..
పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద కేటాయించిన రూ.150 కోట్ల నిధుల్లో కేంద్ర ప్రభుత్వం రూ.120 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30 కోట్లు సమకూర్చుతాయి. ఈ నిధుల్లో రూ.90 కోట్లు ఆస్పత్రి భవనాల కోసం, రూ.60 కోట్లు వైద్య పరికరాల కోసం కేటాయించనున్నట్లు సమాచారం. కేంద్రం ఆమోదించిన ప్రతిపాదనల ప్రకారం క్యాన్సర్ సహా ఎనిమిది కీలక వైద్య సేవలకు సంబంధించి సూపర్ స్పెషాలిటీ సదుపాయాలు కల్పిస్తారు. క్యాన్సర్, న్యూరోసర్జరీ, న్యూరాలజీ, కార్డియాలజీ, కార్డియో సర్జరీ, నెఫ్రాలజీ, యూరాలజీ, పీడీయాట్రిక్ సర్జరీ సంబంధిత వ్యాధులకు అధునాతన వైద్య చికిత్సను అందుబాటులోకి తీసుకురానున్నారు. వీటితోపాటు ఎంఆర్‌ఐ యూనిట్, ఆర్థోపెడిక్, అనస్తీయాలజీ, కార్డియోథోరాసిక్ సర్జరీ, మెడికల్ గ్యాస్ట్రో ఎంట్రోలజీ సేవలు అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. రిమ్స్‌ను పీఎంఎస్‌ఎస్‌వై పథకం కింద ఎంపిక చేయడంతో.. రిమ్స్ సామర్థ్యం వెయ్యి పడకలకు పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. వీటితోపాటు అదనంగా 200 మంది వైద్యులు, ఇతర సిబ్బంది నియామకమవుతారు.
పీజీ తరగతులకు అవకాశం..
ప్రస్తుతం రిమ్స్ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ తరగతులు మాత్రమే కొనసాగుతున్నాయి. గతేడాది ఓ బ్యాచ్ చదువు ముగించుకుని వెళ్లిన సంగతి తెలిసిందే. అయితే.. రిమ్స్‌లో పీజీ తరగతుల అనుమతి లేకపోవడంతో ఎంబీబీఎస్ పూర్తిచేసిన విద్యార్థులు ఇక్కడ కొంతకాలం ప్రాక్టీస్ చేసి పీజీ కోసం ఇతర ప్రాంతాలకు పోతున్నారు. ప్రస్తుతం రిమ్స్‌లో సూపర్‌స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వస్తే పీజీ తరగతులకు కూడా అనుమతులు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీంతో జిల్లా ప్రజలు మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్, మహారాష్ట్ర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండదు. గ్రామీణ నిరుపేదకు సైతం కార్పొరేట్ వైద్యం అందుతుంది.
వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి..
- డాక్టర్ హేమంత్‌రావు, రిమ్స్ డెరైక్టర్
రిమ్స్‌కు రూ.150 కోట్లు మంజూరు కావడంతో ఆస్పత్రిలో వైద్య సదుపాయాలు మెరుగుపడుతాయి. ప్రస్తుతం చాలా విభాగాల్లో స్పెషాలిస్టు వైద్యులు లేరు. ఈ నిధులతో సూపర్‌స్పెషాలిటీ వైద్య సదుపాయాలతోపాటు, స్పెషలిస్టు వైద్య నిపుణులు వస్తారు. సూపర్‌స్పెషాలిటీ ఆస్పత్రికి కావాల్సిన అన్ని సౌకర్యాలు రిమ్స్‌లో ఉన్నాయి. ముఖ్యంగా ఆస్పత్రి భవనాల కోసం కావాల్సిన స్థలం అందుబాటులో ఉంది. జిల్లా ప్రజలకు అత్యాధునిక సేవలు అందుబాటులోకి వస్తాయి.
ఇక ‘సూపర్’ సేవలు
Published Fri, Dec 12 2014 2:51 AM | Last Updated on Tue, Oct 9 2018 6:57 PM
Advertisement
Advertisement