రైతులకు బాసట
వ్యవసాయ భూములున్నా అందులో ఎలాంటి సారం లేక, పంటలు పండక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్న నిరుపేద రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్నాడు ఓ యువకుడు. బీడు భూములను సారవంతంగా మార్చేందుకు నడుం బిగించాడు. ఓ స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేసి నిస్సారంగా ఉన్న భూముల్లో చెరువు మట్టి నిపోయిస్తూ సాగులోకి తెస్తున్నాడు. ఆయనే మండల కేంద్రానికి చెందిన రవికుమార్.
- న్యూస్‌లైన్, మునుగోడు
మునుగోడుకు చెందిన రాధాకృష్ణమూర్తి, విజయలక్ష్మి దంపతుల కుమారుడు రవికుమార్. ఈయన యూకేలో ఎంఎస్ (పబ్లిక్‌హెల్త్ రీసర్చ్)చదువుకున్నాడు. పేద ప్రజలకు సేవచేయాలనే తపనతో 2005లో ఫ్రీడం స్వచ్ఛంద సంస్థను ఏర్పాటుచేశాడు. బీడుభూముల్లో చెరువుమట్టిని పోసి సాగులోకి తేవాలన్న ఆలోచనతో ముందడుగువేస్తున్నాడు. తానే స్వయంగా రైతులను కలిసి వారి సమస్యలు తెలుసుకుంటున్నాడు. జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద రైతుల భూములను ఎంపికచేసుకుని సాగులోకి తేవడానికి కృషిచేస్తున్నాడు.