కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ టీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది.
సాక్షి, హైదరాబాద్: కృష్ణానదీ జలాల వివాదానికి సంబంధించి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో ప్రచురించరాదంటూ టీ సర్కార్ దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ ఈ నెల 8న సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఇదే అంశాన్ని పేర్కొంటూ ఏపీ, కర్ణాటకలు వేసిన పిటిషన్లతోపాటు తీర్పును గెజిట్‌లో ప్రచురించేలా కేంద్రానికి ఆదేశాలివ్వాలని కోరుతున్న మహారాష్ట్ర పిటిషన్‌ను కూడా కలిపి సర్వోన్నత న్యాయస్థానం విచారించనుంది. రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్‌లో ఇంతవరకు తమకు జరిగిన అన్యాయాన్ని ట్రిబ్యునల్ ముందు వినిపించే అవకాశం రానందున, తమ వాదనలు విన్నాకే తుది తీర్పు వెలువరించాలని కోరింది. తమ వాదనలు వినకుండా కేవలం 3 రాష్ట్రాలను లెక్కలోకి తీసుకుంటే నదీ జలాల్లో తమకు అన్యాయం తప్పదని పేర్కొంది. నీటి లభ్యత, మిగులు జలాలు, క్యారీఓవర్‌లపై గతం బచావత్ ట్రిబ్యునల్ తీర్పునకు భిన్నంగా బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పునిచ్చిందని, ఇది కేంద్ర జల సంఘం విధానాలకు విరుద్ధమని నివేదించింది.