సాక్షి, హైదరాబాద్: సీఎం కేసీఆర్ మొండివైఖరిని విడనాడి ఆర్టీసీ కార్మికుల డిమాండ్ల పరిష్కారం ద్వారా సమ్మెకు తెరదించాలని సీపీఐ అగ్రనేత సురవరం సుధాకర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమస్యను రెండు వారాల్లోగా ముగించాలని కార్మికశాఖను హైకోర్టు ఆదేశించిన నేపథ్యంలో ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. న్యాయస్థానం చెప్పినా సీఎం వినడం లేదని, ఇందుకు కేసీఆర్ భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. సోమవారం మఖ్దూంభవన్‌లో పార్టీ నేతలు అజీజ్ పాషా, కూనంనేని సాంబశివరావులతో కలసి సురవరం మీడి యాతో మాట్లాడారు. సీఎం మూర్ఖంగా వ్యవహరిస్తూ కార్మికులపై పగ సాధిస్తున్నారని ఆరోపించారు. ఆర్టీసీ విలీన అంశాన్ని జేఏసీ వాయిదా వేసుకుని, మిగతా సమస్యలు పరిష్కరించాలని కోరినా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ప్రజారవాణా నిలిచిపోవడంతో పేదలు, విద్యార్థులు, మధ్యతరగతి వర్గాలు తీవ్ర ఇబ్బందుల పాలవుతున్నారన్నారు. సీఎంకు నచ్చజెప్పి సమ్మె పరిష్కారానికి టీఆర్‌ఎస్ నేతలు చొరవ తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నాక కూడా ప్రభుత్వాన్ని కూల్చివేస్తారని సీఎం ఎందుకు భయపడుతున్నారని కూనంనేని ప్రశ్నించారు. సర్కార్‌ను కూల్చాల్సిన అవసరం ఎవరికీ లేదని, ఒకవేళ ప్రభుత్వాన్ని కూల్చే పరిస్థితి వస్తే టీఆర్‌ఎస్‌లోని నాయకుల ద్వారానే జరుగుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment