పరువుహత్య కేసులో నిందితుల లొంగుబాటు
తుంగతుర్తి :పరువుహత్య కేసులో నిందితులు పోలీసులు ఎదుట లొంగిపోయారు. కులాంతర వివాహం చేసుకుని తమ పరువు మంటకలిపిందనే కోపంతోనే కూతురిని దారుణంగా అంతమొందించినట్లు ఒప్పుకున్నారు. సోమవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయిన స్వప్న తల్లిదండ్రులు బయ్య లింగమల్లు, బచ్చమ్మను సీఐ పార్థసారథి మీడియా ముందు ప్రవేశపెట్టారు. హత్యకు గల కారణాలు, నింది తుల వివరాలు వెల్లడించారు. తిరుమలగిరి మండలం మామిడిపెల్లి గ్రామానికి చెందిన లింగమల్లు, బచ్చమ్మలు పదిహేనేళ్ల క్రితం బతుకుదెరువు నిమిత్తం మండలంలోని గానుగుబండకు వలస వచ్చారు. వీరికి ముగ్గురు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.
పెద్ద కూతురు స్వప్న అదే గ్రామానికి చెందిన జలగం ప్రవీణ్‌ను ప్రేమించుకున్న విషయం గత ఏడాది తల్లిదండ్రులకు తెలి సింది. వారి ప్రేమ ఇష్టం లేని తల్లిదండ్రులు తమ కూతురుకు వేరే వ్యక్తితో వివాహం చేయాలని నిశ్చయించుకున్నారు. అందులో భాగంగా పెళ్లి సంబంధాలు కూడా చూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గత నెల 14వ తేదీన స్వప్న తన ప్రియుడు ప్రవీణ్‌తో వెళ్లి భద్రాచలంలో వివాహం చేసుకుంది. అనంతరం కొద్దిరోజులకు స్వప్న తన భర్తతో కలసి వచ్చి గ్రామంలో నివసిస్తుండడాన్ని తల్లిదండ్రులు జీర్ణించుకోలేకపోయారు. దీంతో ఈ నెల 9వ తేదీన రాఖీ పండగకు తీసుకొచ్చి దారుణంగా హత్య చేశారని వివరించారు. నిందితులను కోర్టులో హాజరుపరచనున్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్‌ఐ గౌరినాయుడు ఉన్నారు.