నిజామాబాద్ అర్బన్, న్యూస్‌లైన్: జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల పనితీరుపై నిఘా పెరిగింది. విధులకు గైర్హాజరు, వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు వస్తున్న ఆరోపణలపై అధికారులు స్పందించారు. ప్రధానంగా నాలుగు రోజుల క్రితం జిల్లా లో ప్రైవేటు ఆస్పత్రుల వైద్యులు నిరసన చేపట్టిన సమయంలో వారికి మ ద్దతుగా ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు విధులను బహిష్కరించడంపై కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న తీవ్రంగా పరిగణిస్తున్నారు. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో ఆస్పత్రికి వచ్చిన రోగులు వైద్య సహాయం అందక విలవిలలాడి పోయారు.
మరుసటి రోజు పత్రికల్లో వార్తలు రాగా కలెక్టర్ వెంటనే జిల్లా ఆరోగ్యశాఖాధికారి గోవింద్ వాగ్మరే, ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్‌లను పిలిపించారు. గాడి తప్పిన ఆస్పత్రి తీరుపై మండిపడ్డారు. ఈ క్రమంలో ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్యుల విధి నిర్వహణపై పూర్తి పరిశీలిన చేపట్టేందుకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. హైదరాబాద్ నుంచి ఎంతమంది వైద్యులు రాకపోకలు సాగిస్తున్నారు. వీరు సక్రమంగా విధులకు హాజరవుతున్నారా లేదా అన్న విషయాలను సేకరిస్తున్నారు. ఈ మేరకు ఆస్పత్రిలో ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. వైద్యులు విధుల్లో నిర్లక్ష్యం చేసినట్లు తేలితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మెడికల్ కళాశాల తరపున కేటాయించబడిన వైద్యులపై అధికారులు సీరియస్‌గా ఉన్నారు. వీరు విధులకు హాజరు కానప్పటికీ రిజిస్టర్‌లో సంతకాలు చేస్తూ వేతనాలు తీసుకుంటున్నట్లు అధికారుల దృష్టిలో ఉంది. ఇలాంటి వైద్యులను డీఎంఈకి సరెండర్ చేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు.
ఇదిలా ఉండగా గురువారం జిల్లా ఆస్పత్రిలో వైద్యులతో ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్, పరిపాలన అధికారి నరేందర్ సమావేశం నిర్వహించగా వైద్యులు తిరగబడ్డారు. మాపైనే కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తారా.. మా రిజిష్టర్లు కలెక్టర్‌కు చూపిస్తారా అంటూ పరిపాలన అధికారితో వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ‘ మా విధులకు కలెక్టర్‌కు ఏమిటి సంబంధం?’ అంటూ ఆగ్రహావేశాలు వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘మే మంతా మెడికల్ కళాశాల పరిధిలో ఉన్నాము.
మేము ఎవరి మాటా వినదల్చుకోలేదు’ అంటూ వైద్యులు చిందులేశారు. దీంతో చేసేదీఏమీ లేక వైద్యాధికారులు బిత్తరపోయారు. గైర్హాజరు వేసినందుకు ఓ వైద్యుడు వైద్యాధికారులను బెదిరించినట్లు తెలిసింది. దీంతో ఆస్పత్రి సూపరింటెండెంట్ భీంసింగ్ జోక్యం చేసుకుని వైద్యులను హెచ్చరించినట్లు సమాచారం. ‘వైద్యాధికారులంటే తమాషాగా ఉందా, అధికారులు చెబితే ఎందుకు వినడం లేదంటూ’ మండిపడినట్లు తెలిసింది. సక్రమంగా విధులు నిర్వహించకుంటే నిబంధనల ప్రకారం కఠిన చర్యలు తప్పవని, పనితీరుపై జిల్లా కలెక్టర్‌కు నివేదిక అందజేస్తామని ఆయన సమావేశంలో స్పష్టం చేశారు. ఇకనైనా విధుల్లో నిర్లక్ష్యాన్ని వీడాలని, లేకపోతే, చర్యలు తీసుకుంటామని వైద్యాధికారులు హెచ్చరించారు. సమావేశం ఆద్యంతం వాగ్వాదాలతోనే ముగిసింది.
వైద్యుల పనితీరుపై నిఘా
Published Fri, May 30 2014 3:22 AM | Last Updated on Sat, Oct 20 2018 5:53 PM
Advertisement
Advertisement