ఏ,బీ,సీ కేటగిరీల్లో పరిశ్రమలకు అనువైన ప్రభుత్వ భూముల గుర్తింపు
వీలున్నంత త్వరగా టీఎస్‌ఐడీసీకి అప్పగించే కసరత్తు
అసైన్డ్ చేసిన భూములపై కూడా రీ సర్వే
ఉపయోగంలో లేకుంటే ప్రభుత్వ స్వాధీనంలోకి
ఇప్పటికే దిల్ సంస్థకిచ్చిన 529 ఎకరాలు యాదాద్రి అథారిటీకి
మరో మిగిలిన 1000 ఎకరాలు కూడా ప్రభుత్వ ఆధీనంలోనికి?
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో ఉన్న ప్రభుత్వ భూములను మళ్లీ సర్వే చేయాలని అధికార యంత్రాంగం నిర్ణయించింది. గతంలో నిర్వహించిన భూముల సర్వేకు అదనంగా ఈసారి పారిశ్రామిక వర్గాలకు అనువైన భూములను కేటగిరీలుగా విభజించాలని, గతంలో వివిధ సంస్థలకు, వ్యక్తులకు అసైన్ చేసిన వ్యవసాయ, వ్యవసాయేతర భూములను రీసర్వే చేయాలని నిర్ణయించింది. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి ఇచ్చిన ఆదేశాల మేరకు ఈ సర్వే చేపడుతున్నట్టు తెలిసింది.
ఈ సర్వేలో భాగంగా అసైన్ చేసిన భూములు ఉపయోగంలో లేకుండా మళ్లీ ఆ భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఇప్పటికే డెక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (దిల్)కిచ్చిన భూముల్లో ఉపయోగంలో లేని వాటిని యాదగిరిగుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకి ఇవ్వగా, మరికొన్ని భూములను కూడా ప్రభుత్వం స్వాధీనం చేసుకోనుంది. ఈ మేరకు సర్వే పూర్తయిన తర్వాత జిల్లాలోని నిరుపయోగ అసైన్డ్‌భూములను ప్రభుత్వం స్వాధీనం చేసుకోనున్నట్టు సమాచారం.
ఇటీవలే సర్వే
జిల్లాలో ప్రభుత్వ భూముల సర్వే ఇటీవలే పూర్తయింది. దామరచర్లలో ఏర్పాటు చేయనున్న థర్మల్ పవర్‌ప్లాంటుకు సంబంధించిన భూములకు సంబంధించి అటవీభూములకు పరిహారంగా ప్రభుత్వ భూములు ఇవ్వాలన్న ఆలోచనతో జిల్లాలోని ప్రభుత్వ భూములన్నింటినీ సర్వే చేశారు. ఈ మేరకు ప్రభుత్వానికి ఏ రెవెన్యూ డివిజన్‌లో ఎన్ని ప్రభుత్వ భూములన్నాయనే అంశాలతో నివేదిక కూడా పంపారు. అయితే, ఈ సర్వేలో జిల్లాలో మొత్తం 1.29లక్షల ఎకరాల ప్రభుత్వ భూములున్నాయని తేలగా, అందులో 3,720 ఎకరాలు పరిశ్రమల స్థాపనకు అనుకూలమని తేల్చారు. ఈ భూములను వర్గీకరించేందుకు గాను మళ్లీ సర్వే చేయనున్నారు.
పరిశ్రమల ఏర్పాటుకు నేరుగా ఉపయోగపడే భూములను ‘ఏ’ కేటగిరీలో, కొంత అనువుగా ఉన్న భూములను ‘బీ’ కేటగిరీలో, మరికొంత ప్రతికూలంగా ఉన్న భూములను ‘సీ’ కేటగిరీలో, పూర్తిగా రాళ్లు, రప్పలతో ఉన్న భూములను ‘డీ’ కేటగిరీలుగా విభజించనున్నారు. తద్వారా పరిశ్రమల ఏర్పాటుకు ముందుకు వచ్చే కంపెనీలకు సులభతరంగా భూములివ్వవచ్చని, అనువుగా లేని చోట్ల రాయితీలతో ఆకర్షించవచ్చనేది ప్రభుత్వ యోచనగా ఉంది. ఈ మేరకు సర్వే చేస్తున్నామని, సర్వే పూర్తికాగానే నివేదికను ప్రభుత్వానికి పంపుతామని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్. ఎన్.సత్యనారాయణ ‘సాక్షి’కి చెప్పారు.
ఉపయోగంలో లేకుండా స్వాధీనంలోనికి
జిల్లా వ్యాప్తంగా నిరుపేదలకు 1958 నుంచి ప్రభుత్వ భూములను అసైన్ చేస్తూ వస్తున్నారు. ఈ భూములను సాగు చేసుకుని నిరుపేదలు ఉపాధి పొందాలన్నది అసైన్‌మెంట్ లక్ష్యం. అయితే, ఈ భూముల్లో వేల ఎకరాలు సాగు కావడం లేదని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. మరోవైపు వ్యవసాయేతర భూములను కూడా కొన్ని పరిశ్రమలు, సంస్థలకు కేటాయించారు. ఈ భూములను కేటాయించిన సమయంలో ఆయా కంపెనీలు, సంస్థలు చెప్పిన కారణాల మేరకు ఆ భూములను వినియోగించుకోవడం లేదని తెలుస్తోంది. దీంతో ఆయా భూములన్నింటినీ రీసర్వే చేయనున్నారు. ఇప్పటికే దిల్‌కిచ్చిన 529 ఎకరాలను గుట్ట డెవలప్‌మెంట్ అథారిటీకివ్వగా, మరో 1000 ఎకరాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నిర్ణయించింది. అదే విధంగా వివిధ సంస్థలు, ఏజెన్సీలకిచ్చిన మరో మూడువేల ఎకరాల భూములు కూడా నిరుపయోగంగా ఉన్నాయని, వాటిని కూడా స్వాధీనం చేసుకోవాలనేది ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
మళ్లీ సర్వే
Published Fri, May 8 2015 1:24 AM | Last Updated on Wed, Sep 18 2019 2:55 PM
Advertisement
Advertisement