ఖమ్మం జడ్పీసెంటర్: ప్రతీ కుటుంబానికి సంబంధించిన సమాచారాన్ని తయారు చేసి అర్హులందరికీ ప్రభుత్వ పథకాలు అందించే ఉద్దేశంతో ప్రభుత్వం సమగ్ర సర్వేకు శ్రీకారం చుట్టిందని కలెక్టర్ ఇలంబరితి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సర్వేతో ప్రభుత్వ కార్యక్రమాల అమలు సులభం అవుతుందని, మర్ని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టేందుకు దోహదపడుతుందని పేర్కొన్నారు.
ఈ నెల 19వ తేదీన జిల్లాలోని అన్ని గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి సర్వే జరుగుతుందని, ఆ రోజు ప్రజలంతా ఇళ్లలోనే ఉండాలని కోరారు. ఈ సర్వేలో ఎన్యుమరేటర్లకు కుటుంబ సభ్యుల వివరాలు, ఇళ్లు, ఇంటి విద్యుదీకరణ, వికలాంగులు, దీర్ఘకాలిక వ్యాధులు, వ్యవసాయ భూమి, పశు సంపద, సొంత స్థిర, చరాస్తుల వివరాలు తెలపాలని కోరారు.
సరైన సమాచారం ఇచ్చి నవతెలంగాణ నిర్మాణంలో జిల్లా ప్రజలందరూ భాగస్వాములు కావాలన్నారు. జిల్లాలో ఇప్పటికే 100 శాతం స్టిక్కరింగ్ పూర్తయిందని తెలిపారు. స్టిక్కరింగ్ లేని వారు సంబంధిత తహశీల్దార్లను సంప్రదించాలని కోరారు. భవిష్యత్‌లో పేదలకు ప్రభుత్వం అందించే రాయితీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేసేందుకే బ్యాంకు అకౌంట్ల వివరాలు అడుగుతారని కలెక్టర్ పేర్కొన్నారు.
19న పబ్లిక్ హలిడే...
సర్వే సందర్భంగా 19వ తేదీన అత్యవసర సేవలు అందించే సంస్థలు మినహా అన్ని ప్రభుత్వ ప్రైవేటు సంస్థలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవు ప్రకటించిందని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రజలు సర్వేలో పాల్గొనేందుకు అన్ని సంస్థలు తమ ఉద్యోగులకు సెలవు ఇవ్వాలని కలెక్టర్ స్పష్టం చేశారు. సెలవు దినం ప్రకటించని సంస్థలు ఏమైనా ఉంటే వాటి వివరాలు - 8008342626, 9959553231, 8008091118, 9866182504 నంబర్లకు తెలపాలన్నారు.
నిర్భయంగా సమాచారం ఇవ్వండి...
ఖమ్మం జడ్పీసెంటర్: సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు నిర్భయంగా సమాచారం అందించాలని కలెక్టర్ ఇలంబరితి తెలిపారు. సర్వే సమయంలో ఎలాంటి భయం, సందేహం వద్దని అన్నారు. సర్వేకు వచ్చే ఎన్యుమరేటర్లకు చూపాల్సిన పత్రాలను కలెక్టర్ తెలిపారు.
రేషన్‌కార్డు,
పట్టాదారు పాస్‌బుక్
ఎల్‌పీజీ గ్యాస్ పత్రాలు
విద్యుత్‌బిల్లు
పింఛన్ పత్రాలు
సదరం సర్టిఫికెట్
కుల, ఆదాయం సర్టిఫికెట్‌లు
ఆధార్ కార్డు
పుట్టినతేదీ సర్టిఫికెట్
పోస్టల్ పాస్ బుక్
ప్రభుత్వ పథకాల లబ్ధికి
సంబంధించిన వివరాలు
మొబైల్ నంబర్
పైన పేర్కొన్న సర్టిఫికెట్లను సర్వే సమయంలో ఎన్యుమరేటర్లకు చూపాలన్నారు. అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచితే సర్వే పూర్తవుతుందన్నారు. సర్వే సజావుగా జరిగేందుకు ప్రజలంతా సహకరించాలని కలెక్టర్ కోరారు.
ప్రభుత్వ పథకాలు అందించేందుకే..
Published Mon, Aug 18 2014 2:54 AM | Last Updated on Sat, Sep 2 2017 12:01 PM
Advertisement
Advertisement