సాక్షి, హైదరాబాద్: రోడ్డు టెర్రర్ రోజురోజుకూ తీవ్రమవుతోంది.రహదారులు రక్తసిక్తమవుతున్నాయి. ప్రమాదాలు ఆందోళనకరంగా మారుతున్నాయి. ఆరునెలల్లో జరిగిన ప్రమాదాలు పలు కుటుంబాల్లో విషాదాన్ని నింపుతున్నాయి. ముఖ్యంగా మృతుల్లో అధికశాతం యువత ఉండటం మరింత ఆందోళనకరంగా మారింది. రోడ్డుపై వాహనాల్లో దూసుకుపోతున్న యువత ట్రాఫిక్ ప్రమాణాలు పాటించకపోవడం, మితిమీరిన వేగంతో ప్రయాణించడం ప్రమాదాలకు ప్రాథమిక కారణాలుగా నిలుస్తున్నాయి. ఏటా తెలంగాణలో 6 వేలమందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. తాజాగా 2019లో జనవరి నుంచి జూన్ మాసాంతానికి రోడ్డు ప్రమాదాల గణాంకాలు ఆందోళనకరంగా ఉన్నాయి. ఆరునెలల్లో ఏకంగా 10 వేల ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. మూడువేల మందికిపైగా దుర్మరణం పాలయ్యారు. ఇప్పటిదాకా 11 వేల మంది గాయపడ్డారు. వీరిలో చాలామంది శాశ్వత అంగవైకల్యానికి గురికావడంతో పలు కుటుంబాల్లో తీరని శోకం మిగిలింది. ఈ గణాంకాల ప్రకారం రోజుకు సగటున 50కిపైగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ప్రమాదాల్లో 18 మంది మరణిస్తుండగా, 66 మంది గాయపడుతున్నారు.
ఈసారి గతేడాదిని దాటుతాయా?
2018 చివరినాటికి 6,603 మంది రోడ్డు ప్రమాదాల్లో మరణించారు. వీటిలో రిమ్మనగూడ, మానకొండూరు, కొండగట్టు వద్ద జరిగిన ప్రమాదాల్లో భారీగా ప్రాణనష్టం జరిగింది. ఈ మూడు ప్రమాదాల్లో మృతులు, క్షతగాత్రులు అంతా ఆర్టీసీ ప్రయాణికులే కావడం గమనార్హం. ఈసారి అర్ధ వార్షిక గణాంకాలు చూస్తుంటే.. సరిగ్గా గతేడాది గణాంకాల కంటే కాస్త అధికంగా ఉన్నట్లు కనిపిస్తోంది. రాబోయే ఆరునెలల్లో ప్రమాదాలు అదుపులోకి రాకపోతే.. గతేడాది కంటే అధికంగా మరణాలు నమోదయ్యే అవకాశాలున్నాయి.
జాతీయ రహదారులపైనే అధికం
జిల్లాలవారీగా రోడ్డు ప్రమాదాలను పరిశీలిస్తే జాతీయ రహదారులున్న ప్రాంతాల్లోనే అవి అధికంగా చోటు చేసుకుంటున్నాయి. సైబరాబాద్ పరిధిలో 386 మంది మరణించగా, రాచకొండ పరిధిలో 368 మంది మరణించారు. సంగారెడ్డి జిల్లాలో 231, వరంగల్ 172, నల్లగొండ 166, సిద్ధిపేట 151 రామగుండం 140, సూర్యాపేటలో 130 మరణాలు సంభవించాయి. కొత్తగూడెంలో తక్కువగా 33, వనపర్తి 38, రాజన్నసిరిసిల్ల 40, జోగులాంబ 50, మహబూబాబాద్‌లో 57 మరణాలు సంభవించాయి.
ప్రమాదాలకు అడ్డుకట్ట ఎప్పుడు?
అధికవేగం, నిబంధనల ఉల్లంఘనలు రోడ్డు ప్రమాదాలకు కారణమని నిపుణులు చెబుతున్నారు. హైవేలున్న ప్రాంతాల్లోనే అధిక ప్రమాదాలు జరిగా యి. రోడ్డుపై వాహనాలు నిలిపి ఉంచడం, సిగ్నల్ జంప్, ప్రమాదకర మలుపుల వద్ద జరుగుతున్న ప్రమాదాల తీవ్రతను పెంచుతున్నాయి. నగర పరిధిలో బాటసారులు రోడ్డుదాటుతూ మృత్యువాతపడుతున్నారు. సరైన ఫుట్‌పాత్‌ల నిర్మాణం, జీబ్రా క్రాసింగ్‌ల నిర్వహణ సరిగా లేకపోవడం కూడా ఇం దుకు కారణం. హైవేలపై పెరిగిన వేగం, బ్లాక్‌స్పాట్ (తరచూ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు)పై కొత్తవారికి అవగాహన లేకపోవడం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్న రోడ్ సేఫ్టీ బిల్లుల వీటికి పరిష్కారం దొరకవచ్చని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment