అడ్డగూడూరు మండలం బిక్కేరు వాగు వద్ద బండ్లబాటను మూసివేస్తున్న అధికారులు
సాక్షి, యాదాద్రి : కరోనా వైరస్ పాజిటివ్ కేసులు జిల్లాలో ఇప్పటి వరకు నమోదు కాలేదు.. లాక్‌డౌన్ పకడ్బందీగా అమలవుతోంది. కాని పొ రుగు జిల్లాలైన సూర్యాపేట, జనగామ, నల్లగొండలో కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతుండడంతో అధికార యంత్రాంగం మరింత అప్రమత్తమైంది. కరోనా లక్షణాలు వెలుగు చూ సిన సరిహద్దుల్లో పకడ్బందీగా కట్టడి చర్యలు ప్రారంభించారు. విదేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారికి కొనసాగుతున్న హోమ్ క్వారంటైన్ పూర్తయ్యింది. ఢిల్లీలోని మర్కజ్ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన 12మందికి నెగిటివ్ రిపోర్టులు ఇప్పటికే వచ్చాయి. అయినా మరికొన్ని రోజులు ప్రభుత్వ క్వారంటైన్‌లో కొనసాగిస్తున్నారు. తాజాగా వారిలో ఏడుగురికి రెండోసారి నెగిటివ్ రిపోర్టులు వచ్చాయి. మిగతా వారి రిపోర్టులు రేపో మాపో రానున్నాయి. మరోవైపు సూర్యాపేట జిల్లాలోని నాగారం మండలం వర్థమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి పాజిటివ్ కేసులు నమోదైన నేపథ్యంలో భౌతిక దూరంపై అధికారులు మరింత దృష్టి సారించారు. సరిహద్దు చెక్‌పోస్టుల్లోనూ భద్రత కట్టుదిట్టం చేశారు. విస్తృత తనిఖీలు చేపడుతున్నారు.
కేసులు నమోదు కాలేదు కాని..
కరోనా లక్షణాలు జిల్లా ప్రజలకు ఇప్పటి వరకు ఎవరికీ బయట పడలేదు. సుమారు 101 మంది జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి వచ్చినవారు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారి హోం క్యారంటైన్ పూర్తయ్యింది. అయితే అడ్డగూడూరు మండలానికి పొరుగున గల సూర్యాపేట జిల్లా నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురికి కరోనా పాజిటివ్ లక్షణాలు వెలుగు చూడడంతో ఒక్కసారిగా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. రెండు జిల్లాలకు సరిహద్దు గల బిక్కేరు వాగుపై రాకపోకలు నిషేధించారు. జిల్లా నుంచి ఎవరు వర్దమానుకోటకు వెళ్లవద్దని ఆదేశాలు జారీ చేశారు. ప్రధానంగా అడ్డగూడూరు మండలం లక్ష్మీదేవి కాల్వ, కోటమర్తి, ధర్మారం గ్రామాల వివిధ వర్గాల ప్రజలు పలు రకాల పనుల కోసం వర్ధమానుకోటకు రాకపోకలు సాగించారు. రైతులు, వ్యవసాయ కూలీలు, భవన నిర్మాణ కార్మికులు ఇలా వివిధ వర్గాల ప్రజలు వర్ధమానుకోటకువెళ్లి వెళ్లి వస్తుంటారు. వర్ధమానుకోటలో పాజిటివ్ లక్షణాలు ఒకే కుటుంబానికి చెందినవారికి కావడంతో ఒక్కసారిగా ఇక్కడి ప్రజల్లో అలజడి ప్రారంభమైంది. అధికారులు, ప్రజలు వర్ధమానుకోటకు జిల్లా నుంచి వెళ్లే బండ్లబాటలను మూసివేశారు. పనుల కోసం ఆ గ్రామానికి వెళ్లిన వారు ఉంటే సమాచారం తమకు ఇవ్వాలని అధికారులు కోరుతున్నారు. మూడు గ్రామాల ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని భౌతిక దూరం పాటించాలని కోరుతున్నారు. దీంతోపాటు పొరుగున గల జనగామ లో ఇద్దరికి పాజి టివ్ లక్షణాలు రావడంతో పొరుగున గల యా దాద్రి జిల్లా ప్రజల్లో అప్రమత్తత పెరిగింది. వివిధ రకాల పనుల కోసం జిల్లా ప్రజలు నిత్యం జనగామకు రాకపోకలు సాగిస్తున్నందున అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
మరింత అప్రమత్తం
పొరుగు జిల్లాల్లో కరోనా పాజిటివ్ కేసులు భయట పడుతున్నాయి. ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్ మరింత పకడ్బందీగా అమలుకు రెవెన్యూ, పోలీసు యంత్రాంగం మరిన్ని చర్యలు తీసుకుంటుంది. కర్ఫ్యూ సమయంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావొద్దు. గ్రామాల్లో, పట్టణాల్లో ముఖానికి మాస్క్ లేకుండా తిరగొద్దు. జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు లేవని, మాకు ఏమి కాదులే అనే నిర్భయం సరికాదు. పొరుగున ఉన్న నల్లగొండ, సూర్యాపేట, జనగాం జిల్లాల్లో వ్యాధి తీవ్రత ఉన్న దృష్ట్యా కుటుంబ సభ్యులు, బంధువులు ద్వారా సంక్రమించే అవకాశాలు ఉన్నాయి. జిల్లా నుంచి విదేశాలకు వెళ్లి వచ్చిన వారికి హోం క్వారంటైన్ పూర్తయ్యింది. ఒక్కొక్కరు 20 రోజులు దాటారు. మర్కజ్ వెళ్లిన 12 మందికి ఇప్పటికే నెగిటివ్ వచ్చింది. బీబీనగర్ ఎయిమ్స్ క్యారంటైన్‌లో ఉన్న వారైన వీరికి ముందు జాగ్రత్త చర్యగా రెండోసారి పరీక్షలు నిర్వహించాం. ఇందులో ఏడుగురికి రెండోసారి నెగిటివ్ వచ్చింది. మరో ఐదుగురి రిపోర్టు రావాల్సి ఉంది. వీరిలో ముగ్గురు గాంధీ ఆస్పత్రిలో ఉన్నారు.– అనితారామచంద్రన్, కలెక్టర్
Comments
Please login to add a commentAdd a comment