ఓ వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం స్ప్రే చేస్తున్న సిబ్బంది, (ఇన్‌సెట్‌లో) కూరగాయలు సప్లయ్ చేస్తున్న అధికారులు
నాగారం (తుంగతుర్తి) : కరోనా కలకలంతో నాగారం మండలం వర్ధమానుకోట గ్రామంలో అధికారులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. రెండురోజుల క్రితం గ్రామంలో ఒకేరోజు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో జిల్లా యంత్రాంగం గ్రామానికి తరలివచ్చింది. ఢిల్లీ మూలాలతో వర్ధమానుకోట గ్రామానికి కరోనా వైరస్ పాకడంతో గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ భాస్కరన్ ఆదేశాల మేరకు గ్రామంలో బారికేడ్లను ఏర్పాటు చేశారు..రాకపోకలను పూర్తిగా నిషేధించి, గ్రామాన్ని కరోనా వైరస్‌వ్యాప్తి ప్రభావిత ప్రాంతంగా ప్రకటించారు. కరోనా నిర్ధారణ అయిన వ్యక్తులు గ్రామంలో ఎవరెవరిని కలిశారో సమాచార సేకరణలో అధికారులు నిమగ్నమైనారు.
ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు..
వర్ధమానుకోట గ్రామాన్ని రెడ్‌జోన్‌గా ప్రకటించడంతో ప్రజలంతా తమ ఇళ్లకే పరిమితమయ్యారు. ఈ నేపథ్యంలో గ్రామస్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ, పోలీసుశాఖల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అక్కడే మాకాం వేసి, ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిస్తున్నారు. గ్రామంలో పారిశుద్ధ్యా న్ని మెరుగుపర్చుతూ, గ్రామంలోని ప్రతి వీధిలో సోడియం హైపోక్లోరైడ్ ద్రావణం పిచికారీ చేశారు. దీంట్లో భాగంగా బుధవారం ప్రజలకు ఉద్యానవనశాఖ ఆధ్వర్యంలో మొబైల్ వాహనం ద్వారా గ్రామంలో కూరగాయలు అందజేశారు. గ్రామానికి ట్యాంకర్, ఆటోల ద్వారా వాటర్‌నీటి సరఫరా చేశారు. అలాగే ఎస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇంటింటికీ తిరిగి సుమారు 3వేల మాస్కులనుపంపిణీ చేశారు.
ప్రతి ఒక్కరికీ వైద్యపరీక్షలు..
జిల్లా వైద్యాధికారి నిరంజన్ ఆధ్వర్యంలో 7 మండలాలకు చెందిన వైద్యసిబ్బంది సుమారు 100 మంది గ్రామంలో ఇంటింటికీ తిరుగుతూ ప్రజలకు వైద్యపరీక్షలు నిర్వహిస్తున్నారు. వైద్యా«ధికారులు, ఏఎన్‌ఎంలు, ఆశ వర్కర్లు, వైద్యాధికారులు ఇంటింటింకి తిరిగి థర్మల్‌స్కానింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు.
క్వారంటైన్‌కు మరో ఆరుగురి తరలింపు..
గ్రామంలో కరోనా సోకిన బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని ఇదివరకే 44మందిని క్వారంటైన్‌కు తరలించగా బుధవారం మరో ఆరుగురు వ్యక్తులను రెవెన్యూ అధికారులు బుధవారం గుర్తించి సూర్యాపేటలో క్వారంటైన్‌కు తరలించారు. అలాగే వీరి కుటుంబ సభ్యులను హోం క్వారంటైన్‌లో ఉంచారు.
హెచ్చరికలు జారీ..
వర్ధమానుకోట గ్రామంలో ఒకేరోజు ఆరు కరోనా పాజిటివ్ కేసులు నమోదు కావడంతో అధికారులు వైరస్ వ్యాప్తి ప్రభావిత ప్రాంతంగా రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఈ సందర్భంగా సీఐ శ్రీనివా స్, ఎస్‌ఐ ఎం.లింగం, పోలీస్ సిబ్బంది ఆటోలకు, వాహనాలకు మైక్‌లు పెట్టుకొని ప్రజలు ఎవరుకూడా ఇళ్లనుంచి బయటికి రావొద్దని హెచ్చరికలు జారీ చేస్తూ అడుగడుగునా నిఘా పెంచారు. అలాగే గ్రామంలోకి ఎవరు రాకుండా, ఎవరు బయటికి వెళ్లకుండా గ్రామ శివారులలో, గ్రామాలకు వచ్చే దారులను ఎక్కడికక్కడ బారికేడ్లతో మూసివేసి, చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. అలాగే ప్రజలకు ఏమైన నిత్యావసరాలు ఉంటే రెవెన్యూ, పోలీసు శాఖలను సంప్రదించాలన్నారు. ప్రజలు విధిగా లాక్‌డౌన్‌ను పాటించాలని, నిబంధనలను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరిస్తున్నారు.
‘పేట’లో మరో వ్యక్తికి కరోనా పాజిటివ్
సూర్యాపేట : సూర్యాపేట పట్టణంలో కొత్తగూడెం బజార్‌కు చెందిన ఓ వ్యక్తికి బుధవారం కరోనా పాజిటివ్ వచ్చినట్టు సంబంధిత అధికారులు తెలిపారు. అపోలో మెడికల్ షాపులో పనిచేసిన వ్యక్తి ఇతనికి స్నేహితుడు కావడం, ఇద్దరు కలిసి తిరగడంతో సదరు వ్యక్తికి కరోనా వైరస్ సోకినట్టు పరీక్షల్లో తేలింది. ఈ పాజిటివ్ కేసుతో జిల్లాలో మొత్తం కేసుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఇందులో సూర్యాపేట పట్టణంలో మూడు కాగా నాగారం మండలం వర్ధమానుకోటలో ఆరు కేసులు ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment