‘కత్తెరలో కాపు వచ్చే బత్తాయి టన్నుకు రూ.50వేలకు విక్రయిస్తేనే గిట్టుబాటు అవుతుంది. ఏటికేడాది పెట్టుబడులు పెరుగుతున్నాయి. కూలీల ఖర్చులు, రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు, ట్రాక్టర్ కిరాయిలు ఇవ్వన్నీ లెక్కలేస్తే ఖర్చులు బాగా పెరిగాయి. మొక్కలు నాటి ఐదేళ్లనుంచి ఏడేళ్ల వరకు ఫలసహాయం కోసం ఎదురు చూడాలి. ప్రభుత్వం కచ్చితంగా ఇతర రాష్ట్రాల ఎగుమతికి అవకాశమిస్తేనే బతికి బటయ పడతాం..’ ఇదీ.. బత్తాయి రైతు వాసుదేవుల సత్యనారాయణ రెడ్డి ఆవేదన.. ఈ ఒక్క రైతు అనే కాదు.. జిల్లాలో వందలాది మంది బత్తాయి రైతుల ఆవేదన కూడా ఇదే.
సాక్షిప్రతినిధి, నల్లగొండ : కరోనా (కోవిడ్–19) ప్ర భావానికి బత్తాయి రైతు ఆగమాగమవుతున్నాడు. లక్షలాది రూపాయల పెట్టుబడులతో ఉమ్మడి నల్ల గొండ జిల్లాలో వేలాది ఎకరాల్లో బత్తాయి తోటలను సాగుచేస్తున్నారు. ప్రతి ఏటా రైతులు కత్తెర పంటపై కొంత ఆదాయం పొందుతూ ప్రభుత్వానికి ఆదాయాన్ని తెచ్చి పెడుతున్నారు. లాక్‌డౌన్ వల్ల బయటి రాష్ట్రాలకు ఎగుమతులకు అనుమతులు లేకపోవడం, స్థానిక మార్కెట్ అంతగా ఆదుకోలేకపోవడం వల్ల రైతులకు నష్టాలు తప్పేలా లేవు. జిల్లాలో 46వేల ఎకరాల్లో బత్తాయి సాగవుతోందనని అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. వీటి ద్వారా ఈ కత్తెరలో కనీసం 43వేల టన్నుల బత్తాయి దిగుబడి వస్తుందని అంచనా వేశారు.
దయనీయంగా.. బత్తాయి ధర
గత ఏడాది ఈ సీజన్‌లో ఇదే ఏప్రిల్ నెలలో టన్ను బత్తాయిలకు తోటల దగ్గరనే దళారులకు రూ.40వేలకు విక్రయించారు. మే మొదటి వారంలో టన్నుకు రూ.50వేలకు విక్రయించారు. కానీ, ఈ ఏడాది మా ర్చిలో టన్నుకు రూ.15వేల చొప్పున మాత్రమే ధర పలికింది. గత నెల చివరి వారంలో హైదరాబాద్ కొత్తపేట మార్కెట్‌కు ఒకరోజు నాలుగైదు టన్నుల బత్తాయిలు తీసుకెళ్లిన రైతులకు టన్నుకు రూ.36వేలనుంచి రూ.38వేల వరకు ధర పలికింది. కానీ, ఆ తర్వాత అకస్మాత్తుగా టన్ను ధర రూ.25వేల నుంచి 20వేల వరకు పడిపోయింది. గడిచిన వారం రోజులుగా హైదరాబాద్ కొత్తపేట మార్కెట్‌లో టన్ను బత్తాయికి రూ.10వేల నుంచి రూ.12వేలకు మించి రావడం లేదని వాపోతున్నారు.
చేతులెత్తేసిన జిల్లా యంత్రాంగం
రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రకటన మేరకు జిల్లా యంత్రాంగం బత్తాయి రైతుల దిగుబడులను విక్రయించేందుకు సహాయ సహకారాలు అందజేస్తామని చేసిన ప్రకటనలు కేవలం కలగానే మిగిలిపోయాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. కాగా, లాక్‌డౌన్ ఉన్నా, మహారాష్ట్ర నుంచి కమలా, బత్తాయి, ద్రాక్ష, దానిమ్మ వంటి పండ్ల దిగుబడులు హైదరాబాద్ కొత్తపేట మార్కెట్‌కు వస్తున్నాయని చెబుతున్నారు. దీంతో ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్ జిల్లాల్లో పండిన కత్తెర బత్తాయి పంట తోటల్లోనే నిలబడిపోయింది. మరో 15రోజులకు మించి బత్తాయిలు తోటల్లో నిలబడేలాలేవని, ఇప్పటికే కాయలు పసుపు రంగుకు మారుతుండటంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారని చెబుతున్నారు. ఎండలు పెరుగుతుండటంతో కాయ రాలిపోయే ప్రమాదం కూడా పొంచి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుని ఢిల్లీ, నాగపూర్, మద్రాస్, కలకత్తా, కేరళ తదితర ప్రాంతాలకు ఎగుమతికి అనుమతిస్తేనే తమకు ఊరట లభిస్తుందని పలువురు బత్తాయి రైతులు పేర్కొంటున్నారు.
బత్తాయి రైతుకు అండగా ఉంటాం :జగదీశ్‌రెడ్డి, విద్యుత్ శాఖ మంత్రి
బత్తాయిపై విçస్తృత ప్రచారానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. బత్తాయి, నిమ్మ రైతులకు అండగా నిలబడాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం. బత్తాయి వినియోగంపై ప్రజలలో అవగాహన పెరిగితే ఇక్కడి పంటకు ఇక్కడే మార్కెట్ పుష్కలంగా ఉంటుంది. అదే సమయంలో కరోనా వైరస్ బారిన పడి క్వారంటైన్లలో ఉంటున్న వారికి బత్తాయిల సరఫరా జరుగుతుంది. మహారాష్ట్రలోని బెల్గాం, నాందేడ్‌లలో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీలతో తెలంగాణ బత్తాయిలు కొనిపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. బత్తాయి రైతుకు అండగా ఉంటాం. రైతులు ఆందోళన చెందొద్దు.
Comments
Please login to add a commentAdd a comment