ఖమ్మం కలెక్టరేట్ : పంచాయతీ కార్యదర్శుల పోస్టుల భర్తీకి పోలవరం ‘ముంపు’ గండం పొంచి ఉంది. సర్టిఫికెట్ల పరిశీలన కూడా పూర్తయి... రోజులు గడుస్తున్నా జిల్లాలోని 83 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు భర్తీ చేయడం లేదు. ఇందులో పోలవరం ముంపుతో ఆంధ్రప్రదేశ్‌లోకి వెళ్లిన ఏడు మండలాల పరిధిలోనే ఎక్కువ పోస్టులు ఉండడంతో ఏం చేయాల నేది అధికారులకు అంతు పట్టడం లేదు.
ఈ విషయంలో ఏ స్థాయిలోనూ ఎలాంటి స్పష్టత లేకపోవడంతో వారు మల్లగుల్లాలు పడుతున్నారు. అయితే, ఈ పోస్టుల భర్తీకి ముంపు మండలాలను సాకుగా చూపుతున్నారే తప్ప.. ఈ మండలాల్లోని పోస్టులను భర్తీ చేయకుండా నిలిపివేయాలని ఎక్కడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలివ్వలేద ని, అలాంటప్పుడు పోస్టుల రిక్రూట్‌మెంట్ చే యకుండా ఎందుకు ఆపుతున్నారో అర్థం కా వ డం లేదని అర్హులైన అభ్యర్థులు వాపోతున్నారు.
65 పోస్టులు ముంపు మండలాల్లోనే...
జిల్లా వ్యాప్తంగా గ్రేడ్-4 పంచాయతీ కార్యదర్శుల పోస్టులు 149 ఉన్నాయి. వాటిలో 35 మంది రెగ్యులర్ కార్యదర్శులు పనిచేస్తున్నారు. ఇవి పోగా 111 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో 83 పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో రాత పరీక్షలు నిర్వహించి, అందులో ఎంపికైన వారి సర్టిఫికెట్‌లను కూడా పరిశీలించారు. అయితే వారికి పోస్టింగ్‌లు ఇ వ్వడంలో మాత్రం అధికారులు తాత్సారం చే స్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. రోజుల తరబడి పోస్టుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వస్తోందని అభ్యర్థులు వాపోతున్నారు.
అధికారులు ఏమంటున్నారంటే...
ప్రస్తుతం భర్తీ చేయల్సిన 83 పోస్టులకు గాను 65 పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో కలిసే ముంపు ప్రాంతాలైన ఏడు మండలాల్లోనే ఉన్నాయని, వీటి భర్తీ ఎలా చేపట్టాలలో అర్థం కావడం లేదని అధికారులు చెపుతున్నారు. మరోవైపున ఈ పోస్టుల భర్తీ నిలిచిపోవడంతో అర్హులైన అభ్యర్థుల్లో ఆందోళన మొదలవుతోంది. ముంపు సమస్యతో పెట్టుకుంటే ఇది ఇప్పుడిప్పుడే పరిష్కా రం కాదని, తమకు ఇప్పట్లో ఉద్యోగాలొచ్చే అవకాశం లేదని వారు ఆవేదన చెందుతున్నారు.
ఇక ముంపు మండలాకు చెందిన అభ్యర్థులయితే మరీ గందరగోళ పడుతున్నారు. ఎప్పుడో పరీక్షలు రాసిన తమకు ఇప్పుడు ఆర్డినెన్స్ పేరుతో ఉద్యోగాలివ్వకపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలోనే ఉంటామని, తాము ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లేది లేదని చెపుతున్నా వినకుండా ఆర్డినెన్స్ ఇవ్వడమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వచ్చిన ఉద్యోగం కూడా ఇవ్వకుండా నిలిపివేయడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి సాకులు చెప్పకుండా, పోస్టులను వెంటనే భర్తీ చేయాలని నిరుద్యోగులు, ఉద్యోగ, ప్రజాసంఘాల వారు కోరుతున్నారు.
‘ముంపు’ గండం
Published Sat, Jun 28 2014 1:22 AM | Last Updated on Sat, Sep 2 2017 9:27 AM
Advertisement
Advertisement