పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో ఈ నెల 9న జరిగిన తల్లి, కుమారుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు.
భార్య, కుమారుడి హత్య కేసులో నిందితుడి అరెస్ట్
నాలుగు రోజుల్లోనే మిస్టరీ చేధించిన పోలీసులు
పరకాల : పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో ఈ నెల 9న జరిగిన తల్లి, కుమారుడి హత్య కేసును పోలీసులు ఎట్టకేలకు చేధించారు. కట్టుకున్న భార్యపై అనుమానం పెంచుకుని ఆమెతోపాటు కుమారుడిని హతమార్చిన వ్యక్తిని వారు గురువారం అరెస్ట్ చేశారు. డీఎస్పీ పుల్లా సంజీవరావు నిందితుల వివరాలు వెల్లడించారు.
హన్మకొండకు చెందిన కుంటల ప్రవీణ్‌కు మొదట నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం గ్రామానికి చెందిన అమ్మాయితో వివాహం జరిగింది. పెళ్లయిన తర్వాత ఏ పని చేయకుండా జల్సాలకు అలవాటుపడి భార్యతో గొడవ పడడంతో ఆమె విడాకులు ఇచ్చి వెళ్లిపోయింది. తర్వాత అతడికి పరకాల పట్టణంలోని బలిజవాడకు చెందిన మంజులతో 2008 ఆగస్టు 24న వివాహమైంది. వారికి 8 నెలల క్రితం బాబు సాయి చరణ్ జన్మించాడు. వారు పట్టణంలోని మల్లారెడ్డిపల్లిలో అద్దె ఇంట్లో నివాసముంటున్నారు. ప్రవీణ్ హన్మకొండలోని భవా నీ పుట్‌వేర్ షాపులో చెప్పుల డిజైన్ పనిచేస్తూ రోజు అప్ అండ్ డౌన్ చేస్తుండేవాడు.
6 నెలలు మంచిగానే ఉన్న ప్రవీణ్ తర్వాత మంజులపై అనుమానం పెంచుకుని తరచూ శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురిచేసేవాడు. జల్సాలకు అలవాటుపడి మంజులను వేధించడంతో 2012లో హన్మకొండ మహిళా పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టింది. దీంతో అతడు పోలీసులకు దొరకకుండా కేరళకు పారిపోయాడు. కేరళలో పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొంతకాలం జైలు జీవితం అనుభవించాక ప్రవీణ్ తన భార్యను ఒప్పించుకుని కేసు కొట్టివేయించుకుని మళ్లీ కాపురం చేయసాగాడు. ఈ క్రమంలో మళ్లీ అనుమానంతో మంజులను శారీరకంగా, మానసికంగా వేధించసాగాడు. భార్యపై అనుమానంతో సాయిచరణ్ తనకు పుట్టలేదని, వారిని చంపాలని పథకం రచించాడు. ఈ క్రమంలో ఈ నెల 9న హన్మకొండకు వెళదామని ప్రవీణ్ చెప్పడంతో మంజుల నిరాకరించింది. దీంతో కోపోద్రిక్తుడై ఆమె తలపై గొడ్డలితో దాడి చేయగా కిందపడి అక్కడికక్కడే మృతిచెందింది.
అతిదారుణంగా సాయిచరణ్ హత్య
సాయిచరణ్ కింద ఉండి ఏడుస్తుండగా బెడ్‌పై వేసి కరెంట్ మోటార్‌కు వేసే ప్లాస్టర్‌ను బాబు ముక్కుకు, నోటికి వేసి రెండు దిండులను పెట్టి బెడ్‌షీట్ కప్పి అతిదారుణంగా హత్య చేశాడు. కేసు నుంచి తప్పించుకోవడానికి తానే మొదట పోలీసులకు లొంగిపోయాడు. మృతురాలి తల్లి చంద్రగిరి లక్ష్మీ ఫిర్యాదు, డాగ్‌స్క్వాడ్‌తో చేసిన సోదాల కారణంగా ప్రవీణ్‌ను విచారించగా మంజుల, సాయి చరణ్‌ను హత్య చేసింది తానేనని ఒప్పుకున్నాడు. పోలీసులను తప్పుదోవపట్టించబోయినప్పటికీ పోలీసులు కేసు చేధించా రు. సీఐ బి. మల్లయ్య, సిబ్బంది పాల్గొన్నారు.