వికారాబాద్: వివాహేతర సంబంధం ఓ హత్యకు దారితీసింది. మనస్పర్థల కారణంగా నెలకొన్న గొడవలతో పథకం ప్రకారమే యువకుడిని హత్య చేశారు. ఈ నెల 4న వెలుగు చూసిన ఈ ఘటనకు సంబంధించిన కేసు వివరాలను గురువారం చేవెళ్ల ఏసీపీ ప్రశాంత్‌రెడ్డి విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మండల పరిధిలోని హైతాబాద్ చెరువులో ఈనెల 4న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం పైకి తేలింది.
ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సిబ్బందితో కలిసి అక్కడకు చేరుకున్న సీఐ యాదయ్యగౌడ్ చెరువులో నుంచి బాడీని బయటకు తీయించారు. మృతుడి వివరాలను ఆరా తీయగా.. సంకెపల్లిగూడకు చెందిన కుమ్మరి ప్రవీణ్(31) అనే వ్యక్తి.. ఈనెల 1న రాత్రి 9గంటలకు ఇంట్లో నుంచి బయటకు వెళ్లి తిరిగిరాలేదని, కుటుంబ సభ్యులు అతని కోసం వెతుకున్నారని తెలిసింది.
దీంతో గ్రామస్తులకు సమాచారం ఇవ్వగా.. అక్కడకు వెళ్లిన బాధిత కుటుంబ సభ్యులు మృతదేహం ప్రవీణ్‌దేనని గుర్తించారు. తల వైపు ఒక సంచి, కాళ్ల వైపు మరో సంచి కట్టి.. చున్నీతో చేతులను వెనక్కి కట్టేసి.. నడుముకు బండరాయి కట్టి చెరువులో పడేసిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
విచారణలో నేరం అంగీకారం..
హతుడు ప్రవీణ్‌కు ఇదే గ్రామానికి చెందిన కుమ్మరి మమతతో వివాహేతర సంబంధం ఉందని పోలీసులు తెలుసుకున్నారు. ఈ దిశగా విచారణ చేపట్టి మమతతో పాటు ఆమె కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకుని కూపీ లాగగా తామే హత్య చేసినట్లు అంగీకరించారు. మమత భర్త సుధాకర్ గతేడాది జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. ఆ తర్వాత ప్రవీణ్, మమత మధ్య పరిచయం, సాన్నిహిత్యం వివాహేతర సంబంధానికి దారితీసింది. దీంతో మృతుడు పదేపదే మమత ఇంటికి వెళ్లేవాడు.
మనస్పర్థలతో శత్రుత్వం..
కొద్దిరోజులుగా మమత, ప్రవీణ్ మధ్య మనస్పర్థలు చోటుచేసుకున్నాయి. ఈ వ్యవహారాలు గొడవల వరకూ వెళ్లాయి. దీంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. అయినప్పటికీ ప్రవీణ్ మాత్రం మొండిగా వారి ఇంటికి వెళ్లాడు. ఈ క్రమంలో మమత అతనిపై శత్రుత్వం పెంచుకుంది. ప్రవీణ్‌తో తనకు ఇబ్బందులు తప్పేలా భావించి, ఎలాగైనా అతన్ని చంపేయాలని నిర్ణయించుకుంది.
ఆ రోజు జరిగింది ఇదీ..
ఈనెల 1న ప్రవీణ్‌కు ఫోన్ చేసిన మమత ఇంటికి రావాలని చెప్పింది. దీంతో అతడు వెళ్లి తాను ఎప్పటిలాగే మిద్దైపె ఉన్నానని, పైకి రావాలని కోరగా.. మా అత్త, మామ పడుకున్నారు.. ఇంట్లో ఎవరూ లేరు నువ్వే కిందికి రా.. అని సూచించింది. ఇది నమ్మిన మృతుడు ఇంట్లోకి వెళ్లగానే గడియ పెట్టింది. అప్పటికే మమతతో పాటు ఆమె అత్త, మామ, తల్లి, అన్న, మరో వ్యక్తి ఉన్నారు.
ప్రవీణ్ చూసిన వారు అతనితో గొడవ పడ్డారు. హతుడు సైతం వీరితో గట్టిగానే వారించాడు. ఈ క్రమంలో అక్కడే ఉన్న రోకలితో వెనక నుంచి ప్రవీణ్ తలపై మమత బలంగా కొట్టింది. ఆమె అన్న కుమార్ సైతం కొట్టడంతో ప్రవీణ్ పెద్దగా అరుపులు చేశాడు. దీంతో అతడి నోటికి చున్నీ బిగించి.. తల, కాళ్లపై రోకలితో మోదారు. దీంతో స్పృహ తప్పిన ప్రవీణ్ రక్తస్రావమై, ఊపిరాడక చనిపోయాడు.
శవాన్ని మూటగట్టి..
ప్రవీణ్ మరణించాడని నిర్ధారించుకున్న మమత అన్న కుమార్, ఇతడి బావమర్ది మహేశ్ శవాన్ని సంచిలో పెట్టి మూటకట్టారు. స్కూటీపై బాడీ పెట్టుకుని హైతాబాద్ చెరువు ఓడ్డున దింపారు. ఇక్కడ మృతదేహానికి బండరాయిని కట్టి చెరువులో పడేశారు. అనంతరం ఇంటికి వచ్చి రక్తం అంటిన దుస్తులకు నిప్పు పెట్టి కాల్చేశారు. మృతుడి సెల్‌ఫోన్‌ను ధ్వంసం చేసి కాల్చేశారు. ఆ తర్వాత ఎవరి ఇంటికి వారు వెళ్లిపోయారు.
సీసీ పుటేజీల తొలగింపు..
ప్రవీణ్ వచ్చిన విషయం సీసీ కెమెరాల్లో రికార్డు అయిందని గ్రహించిన మమత దామర్లపల్లికి చెందిన కమ్మరి వెంకటేశ్ అనే వ్యక్తిని ఇంటికి పిలిపించి.. సీసీ పుటేజీలన్నింటినీ తీసేయించింది. ఈ కేసులో నిందితులైన కుమ్మరి మమత, కృష్ణయ్య, చంద్రకళ, కుమార్, లక్ష్మి, మహేశ్, కమ్మరి వెంకటేశ్‌ను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ వివరించారు. హత్యకు ఉపయోగించిన రోకలి, ఎలక్ట్రిక్ స్కూటీ, సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో షాబాద్ సీఐ యాదయ్యగౌడ్, ఎస్‌ఐ మహేశ్వర్‌రెడ్డి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment