కాంగ్రెస్‌లో ‘కోమటిరెడ్డి’ కాక
♦ ఇన్‌చార్జినే విమర్శించడంపై విస్మయం
♦ రాహుల్‌గాంధీతో టచ్‌లో ఉన్నారా?
♦ లేక అమీతుమీకి సిద్ధమయ్యారా?
♦ రాష్ట్ర కాంగ్రెస్‌లో జోరుగా చర్చలు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆయన సోదరుడు రాజగోపాల్‌రెడ్డిల తాజా వ్యాఖ్యలు పార్టీలో కలకలం సృష్టిస్తున్నాయి. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిపైనే కాకుండా నేరుగా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ కుంతియాపైనా వారు విమర్శలకు దిగడంపై విస్మయం వ్యక్తమవుతోంది. ఉత్తమ్ పీసీసీ చీఫ్ అయినప్పటి నుంచే ఆయనపై వారు బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు. ఆయన నాయకత్వాన్ని గుర్తించేది లేదని, గడ్డాలు పెంచితే అధికారంలోకి రాలేమని నేరుగా విమర్శలు కూడా సంధించారు.
ఉత్తమ్ నేతృత్వంలో జరిగిన అసెంబ్లీ ఉప ఎన్నిక, జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి నాయకత్వ వైఫల్యమే కారణమంటూ దుయ్యబట్టారు కూడా. ఇప్పుడు మరింత ముందుకెళ్లి, ‘రాష్ట్ర నాయకత్వంలో మార్పు లేదు. 2019 దాకా ఇన్‌చార్జ్‌గా నేను, పీసీసీ చీఫ్‌గా ఉత్తమ్ ఉంటారు’ అంటూ కుంతియా చేసిన ప్రకటనను తీవ్రంగా తప్పుబట్టడం కాంగ్రెస్‌లో హాట్ టాపిక్‌గా మారింది. దీని వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అని కాంగ్రెస్ సీనియర్లలో చర్చ జరుగుతోంది. కోమటిరెడ్డి సోదరులు పార్టీ మారతారంటూ కాంగ్రెస్‌లో ఓ వర్గం కొంతకాలంగా ప్రచారం చేస్తోంది.
వారి తాజా వ్యవహార శైలి ఆ దిశగానే ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ పరువు తీస్తున్నారంటూ పీసీసీ సీనియర్లు కొందరు వారిపై ఇప్పటికే పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీకి ఫిర్యాదు చేశారు. కోమటిరెడ్డి సోదరులు మాత్రం తాము కేవలం స్థానిక నాయకత్వ వైఫల్యాన్నే ఎత్తి చూపుతున్నామని, పార్టీకి విధేయులమేనని చెబుతున్నారు. పార్టీలో తమ స్థానాన్ని పదిలం చేసుకోవడం కూడా వారి తాజా విమర్శల వెనక ఓ వ్యూహం కావచ్చన్న వాదన ఉంది. ఉత్తమ్ నేతృత్వంలోనే వచ్చే ఎన్నికలకు వెళ్తే తమకు టికెట్లు వస్తాయో రావోనన్న అనుమానం వారిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో తమ భవితవ్యం ఏమిటన్న దానిపై నేరుగా అధిష్టానం వద్దే తేల్చుకోవాలని వారు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
రాహుల్‌తో టచ్‌లో ఉన్నారా..?
కోమటిరెడ్డి సోదరులు రాహుల్‌తో టచ్‌లో ఉన్నారేమోనని కూడా పీసీసీ సీనియర్లు కొందరు అభిప్రాయపడుతున్నారు. ‘‘ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో రాహుల్‌తో ఎక్కువ సాన్నిహిత్యమున్నది ఉత్తమ్‌కే. అలాంటి నేతతో పాటు ఏకంగా రాష్ట్ర ఇన్‌చార్జ్ మీదే విమర్శలు ఎక్కుపెట్టారంటే కచ్చితంగా ఏదో వ్యూహం ఉండే ఉంటుంది. అధిష్టానంలోని ముఖ్య నేతల అండ ఉంటే తప్ప వారిలాంటి వ్యాఖ్యలు చేయలేరు. రాహుల్‌తోనూ, ఢిల్లీ ముఖ్యులతోనూ వారు టచ్‌లో ఉన్నట్టున్నారు.
లేదంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసి పార్టీలో కొనసాగడం అంత సులువు కాదు. ఇటు రాష్ట్ర ఇన్‌చార్జ్‌తో, పీసీసీ చీఫ్‌తో వైరం పెట్టుకుని, అటు అధిష్టానం పెద్దల సహకారమూ లేకపోతే పార్టీలో నెగ్గుకురావడం చాలా కష్టం. ఇవన్నీ తెలిసీ ఆషామాషీగా ఇలాంటి వ్యాఖ్యలు చేయరు’ అని కాంగ్రెస్ ముఖ్య నాయకుడొకరు విశ్లేషించారు.
పీసీసీ సారథ్యంతో పాటు ముఖ్య పదవుల్లో ఎలాంటి మార్పులూ ఉండవని కుంతియా ప్రకటించాక కూడా మౌనంగా ఉంటే పార్టీలో తమ ఉనికికే ప్రమాదమని కోమటిరెడ్డి సోదరులు భావిస్తున్నారు. పైగా ఎన్నికల నాటికి తమను పార్టీలో ఏకాకిని చేసే ప్రయత్నాలు ముమ్మరమవుతాయని అనుమానిస్తున్నారు. నల్లగొండ జిల్లాలో తమ సన్నిహిత నేతలను ఇప్పటికే ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో వారేం చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.