కోవిడ్‌ ‘ట్యాబ్లెట్‌’ | Tablets Purchasing Increased In Telangana | Sakshi
Sakshi News home page

కోవిడ్‌ ‘ట్యాబ్లెట్‌’

Published Sun, May 24 2020 4:58 AM | Last Updated on Sun, May 24 2020 4:58 AM

Tablets Purchasing Increased In Telangana - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: విద్యావ్యవస్థకు కోవిడ్‌ కొత్త బాటలు వేసింది. ఇంతకాలం విదేశాలకే పరిమితమైన ఆన్‌లైన్‌ బోధన ఇప్పుడు మనల్నీ పలకరిస్తోంది. గతంలో కొన్ని పెద్ద విద్యాసంస్థలే ఆన్‌లైన్‌ చదువుకు ప్రాధాన్యమిచ్చేవి. ఇప్పుడు గల్లీ బడులు కూడా అదే బాట పడుతున్నాయి. ఫలితంగా విద్యార్థుల చేతుల్లో ట్యాబ్లెట్‌ మొబైల్స్‌ సాధారణమయ్యే పరిస్థితి ఏర్పడింది. లాక్‌డౌన్‌ తర్వాత క్రమంగా తెరుచుకుంటున్న మొబైల్‌ షాపుల్లో టాబ్లెట్‌ మొబైల్స్‌కు డిమాండ్‌ ఏర్పడింది. గత మంగళవారం నుంచి నగరవ్యాప్తంగా మొబైల్‌ షాపులు తెరుచుకుంటున్నాయి. ఇప్పటికే చిన్న షాపులు దాదాపు తెరుచుకోగా, పెద్ద షోరూమ్‌లు క్రమంగా ప్రారంభమవుతున్నాయి. తెరుచుకున్న వాటిల్లో సాధారణ సెల్‌ఫోన్లు కొనేవారు ఎక్కువగా వస్తుండగా, గతంలో ఎన్నడూ లేన ట్టు ట్యాబ్లెట్‌ మొబైల్స్‌ కొనుగోలు రెట్టిం పైంది. గతంలో నెలలో 10 – 15 టాబ్లెట్స్‌ అమ్మే షోరూమ్‌ల్లో ఇప్పుడు రోజూ 2 – 3 చొప్పున కొంటున్నట్టు నిర్వాహకులు చెబుతున్నారు.

వీరంతా విద్యార్థులే కావటం విశేషం. మూడేళ్ల క్రితం సాధారణ ట్యాబ్స్‌ ధర రూ.10వేలుగా ఉండేది. ప్రస్తుతం రూ.3వేలకు మామూలు ట్యాబ్స్‌ లభిస్తున్నాయి. ప్రముఖ బ్రాండ్ల హైఎండ్‌ మోడల్‌ దాదాపు రూ.30వేలకుపైగా ఉంటోంది. కానీ ప్రస్తుతం సాధారణ ట్యాబ్స్‌ను కొనేందుకే విద్యార్థులు మక్కువ చూపుతున్నారు. మధ్య, దిగువ మధ్య తరగతి వారు తక్కువ ధర వాటినే ఎంచుకుంటున్నారు. డిమాండ్‌కు అనుగుణంగా షాపుల్లో 20 వరకు ట్యాబ్స్‌ సిద్ధంగా ఉంచుతున్నామని ఓ షోరూమ్‌ నిర్వాహకుడు చెప్పారు. అయితే, పెద్ద కంపెనీల నుంచి సకాలంలో ఫోన్లు, ట్యాబ్స్‌ సరఫరా కావట్లేదని, పూర్తిగా క్రమబద్ధం కావటానికి మరో నెల పడుతుందని ఆయన తెలిపారు. కాగా, లాక్‌డౌన్‌ తర్వాత తెరుచుకున్న షోరూమ్‌లకు కొనుగోలుదారులు పెద్దసంఖ్యలో వస్తున్నారు. లాక్‌డౌన్‌ సమయంలో చాలా ఫోన్లు పాడవటంతో షాపులు ఎప్పుడెప్పుడు తెరుచుకుంటాయా అని వినియోగదారులు ఎదురుచూస్తూ వచ్చారు. ఇప్పుడు దుకాణాలు తెరుచుకోగానే క్యూ కడుతున్నారు. దీంతో మొబైల్‌ షాపులు రద్దీగా మారాయి.

‘ట్యాబ్లెట్స్‌’ ట్రెండ్‌ నడుస్తోంది
లాక్‌డౌన్‌ తరువాత షోరూమ్‌లు తెరిస్తే కొనుగోలుదారులు వస్తారా అనే అనుమానం ఉండేది. కానీ లాక్‌డౌన్‌కు ముందున్నట్టే ఇప్పుడూ స్పందన ఉంది. అయితే, గతంతో పోలిస్తే 20శాతం మేర కొనుగోలుదారుల రాక తక్కువగా ఉం దనిపిస్తోంది. త్వరలోనే అదీ భర్తీ అవుతుంది. కోవిడ్‌ నిబంధనలను అనుసరించి కొనుగోలుదారులకు ఇబ్బంది లేకుండా చూస్తున్నాం. గతంలో మాదిరిగా వినియోగదారులు ఎక్కువసేపుండకుండా తొందరగా వెళ్లిపోతున్నారు. హైఎండ్‌ మోడల్స్‌ తక్కువగా, బడ్జెటరీ మోడల్స్‌ అమ్మకాలు ఎక్కువగా ఉన్నాయి.  ట్యాబ్లెట్స్‌ కొనుగోళ్లు ట్రెండ్‌గా మారాయి.
– బాలు చౌదరి, ఫౌండర్‌ అండ్‌ సీఎండీ,  బిగ్‌ సీ

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement