బంగారు కాదు.. బాధల తెలంగాణ
రెంజల్ : టీఆర్‌ఎస్‌కు అధికారం అందిస్తే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణగా మారుస్తామన్న ముఖ్యమంత్రి కేసీఆర్, ఆరు నెలల కాలంలో బాధల తెలంగాణగా మార్చారని డీసీసీ అధ్యక్షుడు తాహెర్‌బిన్ హందాన్ విమర్శించారు. మంగళవారం మండలంలోని సాటాపూర్‌లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం పై తీవ్రస్థాయిలో ద్వజమెత్తారు. విద్యుత్ కోతలతో పంటలు ఎండిన రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా ప్రభుత్వం స్పందించడంలేదన్నారు. ప్రస్తుత సీజన్‌లో ఎన్ని గంటల త్రీఫేస్ విద్యుత్‌ను రైతులకు అందిస్తారో ప్రకటించడంలేదన్నారు.
జిల్లాలో 48 శాతం పింఛన్లకు కోతల వాతలు పెట్టారని ఆరోపించారు. పింఛన్ల బెంగతో వృద్ధులు సైతం ఆత్మహత్యలు చేసుకుంటున్నా ప్రభుత్వానికి చలనంలేదన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంలో అన్నివర్గాల ప్రజల ఆత్మహత్యలు పెరుగుతున్నాయన్నారు. ఆత్మహత్యల పాపం టీఆర్‌ఎస్‌దేనన్నారు. కనీసం ఎన్నికల మేనిఫెస్టోలో తెలిపిన హామీలను సైతం ప్రభుత్వం నెరవేర్చడంలేదన్నారు. 25 శాతం రైతు రుణమాఫీ ఖాతాల్లో చేరుతున్నాయని చేస్తున్న ప్రకటన నిరాధారమవుతోందన్నారు.
సభ్యత్వ నమోదుకు స్పందన
కాంగ్రెస్ పార్టీ చేపట్టిన సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తోందన్నారు. పార్టీలో చేరేందుకు ముందుకు వస్తున్నారని అన్నారు. జిల్లాలో ఈ నెల 9వ తేదీ వరకు లక్షా 30 వేల సభ్యత్వం లక్షంగా నిర్ణయించామన్నారు. సమావేశంలో ఎంపీపీ మోబిన్‌ఖాన్, జడ్పీటీసీ సభ్యుడు నాగభూషణంరెడ్డి, సర్పంచ్ జావీదోద్దిన్, వక్ఫ్ బోర్డు జిల్లా డెరైక్టర్ హాజీఖాన్ తదితరులు పాల్గొన్నారు.