శీలం ఖరీదు రూ.లక్ష
గజ్వేల్: బాలికను గర్భవతిని చేయడమే కాకుండా భ్రూణ హత్యకు పాల్పడి శీలానికి వెల కట్టిన ఉదంతం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లిలో వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు శనివారం అరెస్టు చేశారు.
తొగుట సీఐ వెంకటయ్య కథనం మేరకు.. గ్రామానికి చెందిన పెంజర్ల శివాజీ (16) కుటుంబీకులకు చెందిన పొలంలోకి పది నెలల క్రితం అదే గ్రామానికి చెందిన బాలిక (17) చిక్కుడుకాయ ఏరడానికి పనికి వెళ్లింది. ఈ సందర్భంగా శివాజీ మాయమాటలతో ఆమెను లోబర్చుకున్నాడు. ఈ క్రమంలో బాలిక గర్భం దాల్చింది. ఫిబ్రవరి 23, 24 తేదీలలో పెద్దమనుషులు ఈ వ్యవహారంపై పంచాయితీ నిర్వహించారు.
బాలిక శీలానికి రూ. లక్ష వెల కట్టి అబార్షన్ చేయించుకోవాలని సూచించారు. ఆ తర్వాత శివాజీ సోదరుడు రాజు, బావ మేస్త్రీ శ్రీను, సోదరి రాణెమ్మలు కలసి గజ్వేల్‌లోని ప్రైవేట్ ఆస్పత్రిలో అబార్షన్ చేయించారు. విషయం బయటపడడంతో శివాజీ, రాజు, శ్రీను, రాణెమ్మ, డాక్టర్ సాంబశివరావులపై కేసు నమోదు చేసి అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.