
నిధులున్నా నిర్లక్ష్యమేనా!
‘చేవెళ్ల ప్రాంతవాసులు ఎంతో అదృష్టవంతులు.. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రజల విజ్ఞప్తులకు మోక్షం లభించి ంది.
చేవెళ్ల: ‘చేవెళ్ల ప్రాంతవాసులు ఎంతో అదృష్టవంతులు.. ఇక్కడ ఆర్డీఓ కార్యాలయం ఏర్పాటు చేయాలనే ప్రజల విజ్ఞప్తులకు మోక్షం లభించి ంది. ఆర్డీఓ కార్యాలయాన్ని కొత్తగా ఏర్పాటు చేయడమే కాకుండా నూతన భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నాను. వెంటనే పనులు ప్రారంభమవుతాయి’.. 2013 సెప్టెంబరు 30న చేవెళ్లలో ఆర్డీఓ ఆఫీసు ప్రారంభోత్సవం సందర్భంగా అప్పటి రాష్ట్ర మంత్రులు ప్రసాద్‌కుమార్, శ్రీధర్‌బాబు, మాజీ హోంమంత్రి పి.సబితారెడ్డి సమక్షంలో ప్రజల హర్షధ్వానాల మధ్య అప్పటి రెవెన్యూ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి ప్రకటించారు. కానీ పది నెలలు కావస్తున్నా పనులు ప్రారంభం కానేలేదు. దీంతో అద్దె, ఇరుకు గదుల్లో అధికారులు, ప్రజలు ఇబ్బందుల పాలవుతున్నారు.
ఆదేశాలు జారీ..
చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయం గతంలో నగరంలోని అత్తాపూర్‌లో ఉండేది. దూరాభారం అవుతుండటంతో నగరం నుంచి చేవెళ్లకు తరలించాలని ప్రజలు పలుమార్లు విన్నవించుకున్నారు. దీంతో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డీఓ కార్యాలయాన్ని చేవెళ్లకు తరలించింది. స్థానిక విద్యుత్ ఏడీ కార్యాలయ భవనానికి రూ.10 లక్షలతో మరమ్మతులు చేశారు. గత ఏడాది సెప్టెంబరు 30న అప్పటి రెవెన్యూ మంత్రి రఘువీరారెడ్డి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి ఆర్డీఓ సొంత భవనానికి రూ.2 కోట్లు మంజూరు చేస్తున్నామని, వెంటనే పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. కానీ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నచందంగా మారాయి.
చాలీచాలని గదులతో ఇక్కట్లు
ఇక్కడి ఆర్డీఓ కార్యాలయానికి చేవెళ్ల, పరిగి అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని పది మండలాలకు సంబంధించిన రెవెన్యూ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం కొనసాగుతున్న కార్యాలయ భవనం రెవెన్యూ కార్యకలాపాల నిర్వహణకు ఏమాత్రం అనుకూలంగా లేదు.
ఐదుగురి కన్నా ఎక్కువ మంది కూర్చోవటానికి స్థలంలేని పరిస్థితి. ఆర్డీఓతో పాటు ఏఓ, డీఐఓ, డిప్యూటీ స్టాటిస్టిక్స్, ముగ్గురు డీటీలు, నలుగురు సీనియర్ అసిస్టెంట్లు, నలుగురు జూనియర్ అసిస్టెంట్లు, ఆపరేటర్, టైపిస్టు ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు. ఇందులో కేవలం ఏవో, డీటీలకు మాత్రమే సరిపడా గదులున్నాయి. మిగతా అధికారులు చిన్నచిన్న ఇరుకు గదుల్లో ముగ్గురు చొప్పున విధులు నిర్వహిస్తున్నారు. పూర్తిగా సిబ్బంది నియామకం జరిగితే పనులు చేసేందుకు చెట్టు కింద బెంచీలు, కుర్చీలు వేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడుతుందేమోనని వాపోతున్నారు.
చెట్లకింద పడిగాపులు
చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయానికి రెవెన్యూ సంబంధిత పనులపై నిత్యం వందలాది ప్రజలు కార్యాలయానికి వస్తుంటారు. కార్యాలయంలో వేచి చూసేందుకు స్థలంలేక కార్యాలయం వెలుపల చెట్ల కిందపడిగాపులు కాస్తున్నారు. రెవెన్యూ పరిధిలోని తహసీల్దార్లతో సమావేశం ఏర్పాటు చేయాలన్నా చేవెళ్ల తహసీల్దార్ కార్యాలయమే దిక్కు. ప్రతి శనివారం జరిగే రెవెన్యూపరమైన సమస్యల పరిష్కారానికి నిర్వహించే కోర్టు కేసులతో పాటు ఇటీవల జరిగిన ఎన్నికల నామినేషన్లపర్వం నుంచి కౌంటింగ్ వరకు తహసీల్దార్ కార్యాలయంలోనే కొనసాగాయి.
భవన నిర్మాణాన్ని చేపట్టండి-
చేవెళ్ల ఆర్డీఓ కార్యాలయ సొంత భవన నిర్మాణానికి రూ.2 కోట్లు మంజూరైనందున పనులు వెంటనే ప్రారంభించేలా అ దికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. ని త్యం అధికారులు, సిబ్బంది ఇరుకుగదుల్లో పనిచేస్తున్నారని స్పష్టంచేశారు. పనిమీద వచ్చిన వారు కనీసం నిల్చునేం దుకు కూడా స్థలంలేదన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రి పి.మహేందర్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలె యాదయ్యలు స్పందించి వెంటనే ఆర్డీఓ కార్యాలయ భవన నిర్మాణం పనులు ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.