సాక్షి, సిటీబ్యూరో: దాదాపు ఆర్నెళ్లకు పైగా వివిధ ఎన్నికలు..ఎన్నికల కోడ్‌తో పలు కార్యక్రమాలు నిలిచిపోయాయి. అటు అభివృద్ధి కార్యక్రమాలు కుంటుపడటంతోపాటు ఇటు ప్రజా సమస్యల గురించి పట్టించుకున్నవారు లేరు. ప్రస్తుతం ఎన్నికలు ముగిశాయి. అయినా అంతటా నిస్తేజం. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ నాయకుల్లోనూ ఉత్తేజం లోపించింది. ఈ నేపథ్యంలో నగరంపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఇక ఏ ఎన్నికలూ లేకపోవడంతో నగరంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతి.. ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజలతో మమేకమయ్యేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా నగరానికి చెందిన పశుసంవర్థక, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షతన గ్రేటర్ పరిధిలోని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు గ్రేటర్ నగరంలో సేవలందించే మూడు జిల్లాల కలెక్టర్లు, ప్రభుత్వ విభాగాలైన జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, జలమండలి, నీటిపారుదల (లేక్స్ విభాగం), పీసీబీ తదితర విభాగాల ఉన్నతాధికారులతో వచ్చేనెల 2వ తేదీన హరిత ప్లాజాలో ఉన్నతస్థాయి సమావేశానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
సదరు సమావేశంలో నగరంలో నిర్మాణంలో ఉన్న డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు, ఫ్లై ఓవర్లు తదితర అభివృద్ధి కార్యక్రమాల పురోగతి తెలుసుకోనున్నారు. వీటితోపాటు నగర ప్రజలెదుర్కొంటున్న సమస్యలు తదితరమైన వాటి గురించి తెలుసుకునే యోచనలో ఉన్నారు. అనంతరం గ్రేటర్‌లోని 24 నియోజకవర్గాల్లోనూ ఆయా విభాగాల అధికారులతో కలిసి సమావేశాలు నిర్వహించనున్నారు. స్థానిక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, కార్పొరేటర్లు తదితర నేతలు కూడా హాజరయ్యే సదరు సమావేశాల సందర్భంగా ప్రజల నుంచి వచ్చే విజ్ఞప్తులను పరిశీలించి పరిష్కరించాలని భావిస్తున్నారు. అవసరాన్ని బట్టి అక్కడికక్కడే తగిన ఆదేశాలు జారీ చేయనున్నారు. గ్రేటర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లోనూ కొద్ది రోజుల విరామంతో సదరు సమావేశాలు నిర్వహించనున్నారు. ఒక్కో నియోజకవర్గంలో అవసరాన్ని బట్టి మూడు నాలుగు సమావేశాలు కూడా నిర్వహించే ఆలోచన ఉంది. అన్నిసార్లు ఒకే చోట కాకుండా ఒక్కోసారి ఒక్కో ప్రాంతంలో ఈ సమావేశాలు నిర్వహిస్తారు. తద్వారా ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారానికి సత్వరం చర్యలు తీసుకోవడం సాధ్యమవుతుందని భావిస్తున్నారు. మరోవైపు నగరాభివృద్ధి కార్యక్రమాలు వేగవంతంగా జరిగేందుకూ ఇవి తగిన వేదికలు కాగలవని భావిస్తున్నారు. మరోవైపు అధికార టీఆర్‌ఎస్ శ్రేణుల్లో చైతన్యానికీ ఈ సమావేశాలు ఉపకరిస్తాయనే యోచనలో ప్రభుత్వం ఉంది.
ప్రజల్లోకి వెళ్లేలా ప్రభుత్వ పనులు..
ఎన్నో కార్యక్రమాలు చేపట్టినప్పటికీ అవి తగినస్థాయిలో ప్రజల్లోకి వెళ్లడం లేవని ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం చేసే ప్రతిపనీ ప్రజల్లోకి వెళ్లేలా తగిన చర్యలు చేపట్టనున్నారు. ప్రస్తుతం బోనాల పండుగ వస్తుండటంతో ఈ పండుగ కోసం ఆయా ఆలయాలకు కేటాయించే నిధుల్ని పండుగ ముగిశాక కాకుండా పండుగ ముందే ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. అది కూడా స్థానికంగా ఉండే ప్రజల సమక్షంలో సంబంధిత నిధుల చెక్కు అందజేయాలని భావిస్తున్నారు. తద్వారా ఆలాయల వద్ద సున్నాలు, రంగులు వేయడం, ఆలయాలకు దారితీసే రోడ్ల మరమ్మతులు, గుంతల పూడ్చివేత, విద్యుత్ అలంకరణలు తదితర పనుల గురించి ప్రజలు కూడా ప్రశ్నించేందుకు ఆస్కారముంటుంది కనుక నిధులు సద్వినియోగం కాగలవన్నది ప్రభుత్వ ఆలోచన.
Comments
Please login to add a commentAdd a comment