నాపై విమర్శలా.. ఒళ్లు దగ్గర పెట్టుకోండి
హైదరాబాద్ : తనను విమర్శించేవారు ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని....అది చంద్రబాబు నాయుడుకు కూడా వర్తిస్తుందని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఆయన మంగళవారం తన నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడారు. తనకు నైతిక విలువలు గురించి చెప్పే అవసరం లేదని... ఎన్నికలై పదిరోజులు కాకముందే నంద్యాల, అరకు ఎంపీలను ఎవరు తన పార్టీలో చేర్చుకున్నారో అందరికీ తెలుసునని తలసాని పరోక్ష విమర్శలు చేశారు.
మళ్లీ ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని ఆయన చెప్పారు. టీఆర్ఎస్లో చేరిన ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల రాజీనామాపై కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని తలసాని పేర్కొన్నారు. కాగా గ్రేటర్ టీడీపీ, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి ఆయన ఈరోజు ఉదయం రాజీనామా చేశారు. తలసాని ప్రస్తుతం సనత్ నగర్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు.