
సాక్షి, హైదరాబాద్: ‘ఏపీ అసెంబ్లీ మాజీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మృతికి చంద్రబాబు నాయుడే కారణం. ఆయనను మానసికంగా ఇబ్బంది పెట్టింది చంద్రబాబే. మరణానికి ముందు వారంరోజులు ఆసుపత్రిలో ఉంటే కనీసం పరామర్శించలేదు. పార్టీ మీటింగ్‌లకు దూరం పెట్టడంతోపాటు, పార్టీ నుంచి వెలివేసినట్లు వ్యవహరించారు. కోడెల సమస్యలను పరిష్కరించేందుకు చంద్రబాబు చొరవ చూపలేదు. చివరకు ఆయనకు అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదు. ఈ విషయాలన్నింటినీ మరుగున పడేసి.. నెపం జగన్ మీదకు నెట్టే ప్రయత్నం చేస్తున్నారు’అని రాష్ట్ర పశు సంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం అసెంబ్లీ ఆవరణలో ఆయన మీడియాతో పిచ్చాపాటీగా మాట్లాడారు. ‘ఫరీ్నచర్ విషయంలో కోడెల మీద వచ్చిన ఆరోపణలపై పార్టీ అధినేతగా చంద్రబాబు ఏనాడూ స్పందించలేదు. కోడెల అంతిమ యాత్రలో దండాలు పెడుతూ చంద్రబాబు సానుభూతి కోసం ప్రయత్నాలు చేశారు’అని తలసాని వ్యాఖ్యానించారు.