
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర నూతన గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ ప్రమాణస్వీకారం చేశారు. రాజ్‌భవన్ లో ఆదివారం ఉదయం 11 గంటలకు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెతో ప్రమాణం చేయించారు. అంతకు ముందు గవర్నర్‌గా తమిళిసైను నియమిస్తూ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ జారీ చేసిన ఉత్తర్వులను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌కే జోషి చదివి వినిపించారు. ప్రమాణ స్వీకారం అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ ఆమెకు పుష్పగుచ్ఛం అందించి అభినందనలు తెలిపారు. కార్యక్రమం ముగిసిన వెంటనే గవర్నర్ తమిళిసై వేదికపై నుంచి కిందికి దిగి వచ్చి ప్రేక్షకుల్లో కూర్చున్న తన తండ్రి, తమిళనాడు కాంగ్రెస్ నేత కుమారి ఆనందన్ కు పాదాభివందనం చేసి దీవెనలు తీసుకున్నారు. కార్యక్రమం తర్వాత గవర్నర్.. వీవీఐపీ అతిథులకు రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో తేనీటి విందు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్‌గా నియమితులైన దత్తాత్రేయ, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి, తమిళనాడు డిప్యూటీ సీఎం పన్నీరు సెల్వం, తమిళనాడు మంత్రులు వేలుమణి, తంగమణి, నేతలు కె.తారకరామారావు, టి.హరీశ్‌రావు, జగదీశ్ రెడ్డి, ఈటల రాజేందర్, మల్లారెడ్డి, నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి, కొప్పుల ఈశ్వర్, తలసాని శ్రీనివాసయాదవ్, ప్రశాంత్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్, ఎంపీ సంతోశ్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బి. వినోద్‌కుమార్, డీజీపీ మహేందర్ రెడ్డి, నగర పోలీస్ కమిషనర్ అంజనీకుమార్ తదితరులు పాల్గొన్నారు. గవర్నర్‌గా తమిళిసై సౌందర రాజన్ ప్రమాణ స్వీకారోత్సవాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో తమిళనాడు బీజేపీ నేతలు, కార్యకర్తలు, ఇతర పార్టీల నేతలు, ఆమె కుటుంబ సభ్యులు తరలివచ్చారు.
తొలి రోజే కొత్త రికార్డు...
రాష్ట్ర గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే తమిళిసై సౌందర రాజన్ రాష్ట్ర మంత్రివర్గంలో కొత్తగా చేరిన ఆరుగురు మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించి కొత్త రికార్డును సృష్టించారు. గతంలో ఏ గవర్నర్ కూడా బాధ్యతలు స్వీకరించిన తొలిరోజే మంత్రులతో ప్రమాణస్వీకారం చేయించలేదని రాజ్‌భవన్ వర్గాలు తెలిపాయి.
విమానాశ్రయంలో ఘనస్వాగతం...
అంతకు ముందు బేగంపేట విమానాశ్రయంలో తమిళిసై సౌందర రాజన్ కు ఘనస్వాగతం లభించింది. ఆదివారం ఉదయం ఆమె చెన్నై నుంచి శంషాబాద్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో బేగంపేట విమానాశ్రయానికి చేరుకున్న ఆమెకు ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర మంత్రులు, అధికారులు ఘనస్వాగతం పలికారు. పోలీసులు కవాతు నిర్వహించి స్వాగత వందనం సమర్పించారు.
Comments
Please login to add a commentAdd a comment