
కార్పొరేట్లకు కేసీఆర్ ఊడిగం
తమ్మినేని వీరభద్రం
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలన మాటలు ఎక్కువ చేతలు తక్కువ అన్న చందంగా ఉందని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం విమర్శించారు. ఢిల్లీలో జరుగుతున్న పార్టీ కేంద్ర కమిటీ సమావేశాలకు హాజరైన తమ్మినేని శనివారం మీడియాతో మాట్లాడుతూ ‘‘ కేసీఆర్ అనుసరిస్తున్న అభివృద్ధి నమూనా తెలంగాణ బాగుకు, అభివృద్ధికి ఏమాత్రం ఉపయోగపడదు.
చేసిన అభివృద్ధి కంటే చెప్పుకున్నదే ఎక్కువ. వెనకబడిన వర్గాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం బంగారు తెలంగాణ అవుతుంది. కానీ కార్పొరేట్లకు కాంట్రాక్టులు కట్టబెట్టడం, కుటుంబ రాజకీయాలు సుస్థిరం చేసుకోవడం, ఇతర పార్టీల్లోని కాంట్రాక్టర్లు, సంపన్నులను పార్టీలో చేర్చుకోవడం, ప్రతిపక్షం లేకుండా చేసుకోవడం వంటి అంశాలపైనే కేసీఆర్ దృష్టి సారించారు’’ అని దుయ్యబట్టారు. కేంద్ర కమిటీ భేటీలో టీఆర్‌ఎస్ రెండేళ్ల పాలన, తెలంగాణలో ప్రస్తుత పరిస్థితులపై చర్చించామని, ఆయా అంశాలపై కేంద్ర కమిటీకి నివేదిక కూడా ఇచ్చామన్నారు.