ముఖ్యమంత్రి, మంత్రులకు పిచ్చి
ఖమ్మం : ప్రతిపక్షాలకు కాదు.. ముఖ్యమంత్రి, రాష్ట్ర మంత్రులకే పిచ్చిపట్టిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. శనివారం ఖమ్మంలోని పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులను సంక్షోభంలోకి నెట్టింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం కాదా..? అని ప్రశ్నించారు. జీఓ 123ను హైకోర్టు రద్దు చేస్తే.., దానిని ప్రతిపక్షాలు రద్దు చేయించాయని మంత్రి తుమ్మల చెబుతున్నారని, హైకోర్టులో కూడా ప్రతిపక్షం ఉందా అని ప్రశ్నించారు. రూ.12 వేల నుంచి రూ.15 వేలు పలికిన క్వింటాల్ మిర్చి.., ఒక్కసారిగా రూ.3 వేల నుంచి రూ.4వేలకు పడిపోవటం దారుణమన్నారు.
రైతులను ఆదుకోవాల్సిన ప్రభుత్వమే, వారిని అరెస్టు చేయడం హేయమైన చర్య అన్నారు. తక్షణమే మార్క్‌ఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలను ప్రశ్నించేందుకు వచ్చిన నాయకులను కూడా అరెస్టు చేయడం బాధాకరమని అన్నారు. అక్రమ అరెస్ట్‌లతో ఉద్యమాలను ఆపలేరని, రైతులపై ప్రేమ ఉంటే వారికి న్యాయం జరిగేలా చూడాలన్నారు. అక్రమ అరెస్టులకు నిరసనగా ఈ నెల 30 న జిల్లా వ్యాప్తంగా నిరసనలు, మే 2న జిల్లా దిగ్బంధనం చేపట్టాలని పిలుపునిచ్చారు. ఇలోగా సమస్య పరిష్కారం కాకపోతే మే 15న హైదరాబాద్‌లో అన్ని పార్టీలతో కలిసి ధర్నా చేస్తామన్నారు.