
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించే మేడారం ‘సమ్మక్క సారక్క’జాతరకు వచ్చే నేతలను మావోయిస్టు పార్టీ టార్గెట్ చేసుకున్నట్లు ఇంటెలిజెన్స్ బృందాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల భూపాలపల్లి జిల్లాలో పోలీసులు జరిపిన తనిఖీల్లో ల్యాండ్‌మైన్లు బయటపడటంతో అసలు ఆ ప్రాంతంలో ఏం జరుగుతోంది, మావోయిస్టులు ఎవరి కోసం ల్యాండ్‌మైన్లు అమర్చారో తెలుసుకోడానికి దర్యాప్తు ప్రారంభించాయి.
మావోయిస్టుల కదలికల నేపథ్యంలో జనవరి 31 నుంచి మూడు రోజుల పాటు జరిగే మేడారం జాతర భద్రతను పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగానే భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో డీజీపీ మహేందర్‌రెడ్డి, ఇంటెలిజెన్స్ అధికారులు మంగళవారం సుడిగాలి పర్యటన నిర్వహించారు. జాతర సందర్భంగా చేపట్టాల్సిన భద్రత ఏర్పాట్లపై జిల్లా ఎస్పీలు, అధికారులతో చర్చించారు.
ప్రాజెక్టుల భద్రతపై సమీక్ష
గోదావరి పరీవాహక ప్రాంతాల్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారీ నీటిపారుదల ప్రాజెక్టులు, బ్యారేజీల భద్రతపై డీజీపీ సమీక్ష నిర్వహించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో ఇటీవల జరిగిన చండ్రపుల్లారెడ్డి దళ సభ్యుల ఎన్‌కౌంటర్ వ్యవహారంపైనా ఆరా తీసినట్లు సమాచారం. కీలక ప్రాజెక్టులు భూపాలపల్లి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉండటంతో అప్రమత్తంగా ఉండాలని, ఇప్పటికే సీఆర్‌పీఎఫ్ కంపెనీలను మోహరించినా ఎప్పటికప్పుడు పర్యవేక్షించుకోవాలని ఎస్పీలకు సూచించినట్లు తెలుస్తోంది. ప్రాజెక్టులు నిర్మిస్తున్న కాంట్రాక్టర్లను స్థానిక దళ సభ్యులు బెదిరిస్తున్నారన్న అంశాలపైనా డీజీపీ చర్చించినట్లు సమాచారం.
వారికి అదనపు భద్రత: భూపాలపల్లి, మహబూబాబాద్, భద్రాద్రి జిల్లాల ప్రజా ప్రతినిధులు జాగ్రత్తగా ఉండేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీలకు ఉన్నతాధికారులు సూచించినట్లు తెలిసింది. కీలక పదవుల్లో ఉన్న వారితోపాటు స్థానిక అధికార పార్టీ నేతలకూ మరింత భద్రత కల్పించాల్సిన అవసరముందని ఉన్నతాధికారులకు ఎస్పీలు వివరించినట్లు సమాచారం. స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వకుండా నేతలు పర్యటించడం ఇబ్బంది తెచ్చేలా ఉందని ఎస్పీలు అధికారుల దృష్టికి తీసుకొచ్చినట్లు తెలిసింది.
గ్రేహౌండ్స్‌తో జల్లెడ..!
భూపాలపల్లి జిల్లాలోని తాడ్వాయి, పసర, ఏటూరునాగారం, ములుగు, వాజేడు, వెంకటాపురం, మహదేవపూర్, కాటారం, మహాముత్తరం ప్రాంతాలపై పోలీస్ శాఖ దృష్టి సారించినట్లు సమాచారం. 100–150 కి.మీ. దూరంలోని ప్రాంతాలను జల్లెడ పట్టేందుకు గ్రేహౌండ్స్ ప్రత్యేక బృందాలను రంగం లోకి దించనున్నట్లు తెలిసింది. జాతరకు ఎన్ని బలగాలు కావాలి, గతంలో ఎంత మందితో బందోబస్తు నిర్వహించారు, ప్రస్తుత పరిస్థితుల్లో ఎంతమంది అవసరం తదితరాలను డీజీపీ చర్చించినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment