ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకపడ్డారు. సీఎం ఉంటున్నది ప్రగతి భవన్ కాదని.. పైరవీల భవన్ అని విమర్శించారు.
హైదరాబాద్: ముఖ్యమంత్రి కేసీఆర్‌పై టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి మరోసారి విరుచుకపడ్డారు. సీఎం ఉంటున్నది ప్రగతి భవన్ కాదని.. పైరవీల భవన్ అని విమర్శించారు. సీఎంకు ఏదైనా విన్నవిద్దామంటే ఆయన సచివాలయానికి రారని, ప్రగతి భవన్‌లో అపాయింట్‌మెంట్ ఇవ్వరని అన్నారు. సంక్షోభంలో ఉన్న వ్యవసాయ రంగాన్ని తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని, పంటలకు కనీస మద్దతు ధర కల్పించి, దళారుల నుంచి రైతులను కాపాడాలని, ఆత్మహత్య చేసుకున్న రైతు కుటుంబాలకు ఆర్థిక సాయం చేయాలని టీటీడీపీ నేతలు వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి, అధ్యక్షుడు ఎల్ రమణ బృందం మంగళవారం సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్ పీ సింగ్‌ను కలిసి విజ్ఞప్తి చేశారు.
అనంతరం మీడియా పాయింట్‌లో రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతీ వ్యవసాయ మార్కెట్‌లో పర్యవేక్షణాధికారిని నియమించి, రైతులు తెచ్చిన పంటలను తక్షణమే కొనుగోలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. మార్కెట్‌లో సిండికేట్ వ్యవస్థను విచ్ఛిన్నం చేయాలని డిమాండ్ చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వ మూడున్నరేళ్ల పాలనలో మూడువేలకుపైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వడగండ్లతో పంటలు నష్టపోయిన రైతులను ఏ మంత్రి కూడా పరామర్శించలేదన్నారు.
రైతులు పిట్టల్లా రాలిపోతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకున్న పాపానపోలేదన్నారు. సీఎం తన ప్రత్యేక నిధి కింద ఉన్న నిధులను ఫిరాయింపుల కోసం వాడుతున్నారన్నారు. ఆ నిధుల నుంచి రైతులకు రూ. 500 కోట్లు కేటాయించి మిర్చి, కందులు, సోయాబిన్‌లకు బోగన్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీఎం ఇప్పటికైనా మత్తు వదిలి పరిపాలనపై దృష్టి పెట్టాలని కోరారు. ఆంధ్రప్రదేశ్‌లో ఫిరాయింపులపై మీ స్పందనేమిటని విలేకరి అడిగిన ప్రశ్నకు దానికి మీరే సమాధానం చెప్పాలంటూ దాటవేశారు.