వరంగల్ సభకు వెయ్యి కోట్లు వసూలు
టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రగతి నివేదన సభ కోసం ఆ పార్టీ నేతలు రూ.1,000 కోట్లు వసూలు చేశారని, దీనిపై సీబీఐ విచారణ జరిపించాలని టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ కాలంలో కేసీఆర్‌కు ఉస్మానియా విద్యార్థులు గుడి కడతారని భావించారని, ఇప్పుడు ఆ విద్యార్థులే గోరీ కట్టడానికి సిద్ధమయ్యారని హెచ్చరించారు.
మూడేళ్ళుగా సీఎం కేసీఆర్ చెబుతున్న అబద్ధాలకు ఓయూ విద్యార్థులు తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఓయూ విద్యార్థుల ముందు కనీసం తలెత్తుకుని నిలబడే ధైర్యం కూడా కేసీఆర్ చేయలేకపోయారని.. ఇది సీఎం ఆయన పాలన, పరిస్థితిని తెలియజేస్తోందని రేవంత్ చెప్పారు. వరంగల్ టీఆర్‌ఎస్ సభ.. ప్రగతి నివేదన సభ కాదని, దోపిడీ దొంగల సభ అని విమర్శించారు.